![]() |
![]() |

గత ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కాలం నుంచీ ఇప్పటి దాకా దేశంలోని ప్రజానీకంలో అనేకమంది ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ఉద్యోగాలు కోల్పోతే, కొంతమంది వ్యాపారాలు స్తంభించిపోయాయి. కేవలం సాధారణ ప్రజలే కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందిన అనేకమంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. కుటుంబాన్ని పోషించుకోడానికి మరో దారిలేక బెంగాలీ నటుడు అరిందమ్ ప్రమాణిక్ రోడ్డుమీద చేపలు అమ్ముకోవడానికి ఇది కారణం.
అరిందమ్ చెప్పే దాని ప్రకారం మహమ్మారి విజృంభణ మొదలయ్యాక ఆయనకు పని దొరకడం దుర్లభంగా మారింది. దీంతో తప్పనిసరిగా నటనను పక్కనపెట్టి, కుటుంబ పోషణ నిమిత్తం చేపలు అమ్ముకుంటున్నాడు. గతంలో ఆయన తండ్రి కూడా ఇలా తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని మిమారిలో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించాడు. అరిందమ్ ఓ సక్సెస్‌ఫుల్ యాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఆయన యాక్టర్ అయ్యాక తండ్రి కూరగాయల అమ్మకం జోలికి మళ్లీ వెళ్లలేదు. కానీ విధి నుంచి ఎవరు మాత్రం తప్పించుకోగలరు!.. ఇవాళ స్వయంగా అరిందమ్ నటనను వదిలేసి, చేపలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అరిందమ్ పలు బెంగాలీ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాడు. లాక్‌డౌన్ దగ్గర్నుంచీ సరైన ఉపాధి లేకపోవడంతో ప్రతిరోజూ మిమారి స్టేషన్ మార్కెట్‌లో చేపలు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. "మొదట్లో రోడ్డు పక్కన కూర్చొని ఇలా చేపలు అమ్ముకోవడం చాలా కష్టంగా అనిపించింది. కానీ నాకు వేరే దారి లేకపోయింది." అని ఆయన చెప్తుంటే ఆయన గొంతులో ఆవేదన స్పష్టంగా కనిపించింది. బెంగాలీ మెగా సీరియల్ 'సువర్ణలత' ఆయనకు ఇంటింటా గుర్తింపు తెచ్చింది. 'రాశి', 'అగ్నిపరీక్ష' అనే పాపులర్ టీవీ సీరియల్స్‌లోనూ ఆయన నటించాడు.
![]() |
![]() |