![]() |
![]() |
.jpg)
ప్రకాశ్‌రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాననేసరికి టాలీవుడ్‌కు చెందిన కొంతమంది లోకల్, నాన్‌లోకల్ ఇష్యూను బయటకు తెచ్చారు. ఆ రకంగా ప్రకాశ్‌రాజ్‌ను దెబ్బకొట్టాలనేది కొంతమంది ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే 'మా' మెంబర్ అయిన ఎవరైనా ఆ అసోసియేషన్‌లో ఏ పదవికైనా పోటీచేయడానికి అర్హులు కాబట్టి, సాంకేతికంగా ప్రకాశ్‌రాజ్‌ను దెబ్బకొట్టడం సాధ్యంకాదు. అందుకే లోకల్-నాన్ లోకల్ అనే తేడాను తీసుకొచ్చి, మా సభ్యుల్లో ఎమోషన్స్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
ఇప్పటికే మెగా కాంపౌండ్ మద్దతు ఫుల్‌గా సంపాదించేసిన ప్రకాశ్‌రాజ్‌కు నాగబాబు బాహాటంగా మద్దతు ప్రకటించేశారు. కళాకారుడికి లోకల్, నాన్ లోకల్ అనేది ఉండదని తేల్చేయడమే కాకుండా, 'మా'కు మంచి చేయడానికి ఆయన దగ్గర కార్యాచరణ కూడా ఉందని తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌కు మరో ప్రముఖ వ్యక్తి నుంచి కూడా సపోర్ట్ దొరికింది. ఆ వ్యక్తి.. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే, నిత్య వివాదాస్పద వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ.
ట్విట్టర్ వేదికగా ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా మాట్లాడిన ఆయన.. కర్ణాటక నుంచి ఏపీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్‌లోకల్ అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మద్రాస్ వెళ్లిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, మోహన్‌బాబు లోకల్ అవుతారా? ఎలా?.. అని ప్రశ్నలు సంధించారు. ఈ లిస్టులో ఆయన చిరంజీవి పేరును జోడించలేదు. కారణం.. ప్రకాశ్‌రాజ్‌కు ఆయన మద్దతు ఉండటం. ప్రకాశ్‌రాజ్‌తో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయబోతున్న మంచు విష్ణుకు నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మంచు వారి మద్దతు ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబాలకు చెందిన నటుల పేర్లనే వర్మ ప్రస్తావించారనేది స్పష్టం.
‘‘ప్రకాశ్‌రాజ్ నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి నేషనల్ అవార్డ్‌తో సత్కరిస్తే, అతన్ని నాన్ లోకల్ అంటారా? ఇది ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడమే అవుతుంది. ముప్పై ఏళ్లుగా ప్రకాశ్‌రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా? కర్ణాటకనుంచి APకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా? ఎలా? ఎలా? ఎలా? గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు… బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా??? ఎలా ఎలా ఎలా?’’ అని తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు రాము.

![]() |
![]() |