![]() |
![]() |

నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రతిష్ఠ మసకబారిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై 'మా' అధ్యక్షుడు నరేష్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రెస్ మీట్‌లో 'మా'పై ప్రకాష్ రాజ్, నాగబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్ గా శనివారం నరేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగిందని, అందులో కొందరు పలు వ్యాఖ్యలు చేశారని నరేష్ అన్నారు. తన గురించి తాను చెప్పుకునే అవసరం లేదని, సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా తాను, తన కుటుంబం సాయం చేస్తున్నామని తెలిపారు. మా లోని సభ్యులను తాను కలుపుకుపోలేదని కొందరు చేస్తోన్న విమర్శలు సరికాదన్నారు.
మూడు నెలల క్రితమే ప్రకాశ్ రాజ్ తనకు ఫోన్ చేసి, తాను మా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారని తెలిపారు. ఎవరైనా పోటీ చేయొచ్చని తాను చెప్పానని అన్నారు. మా అనేది రాజకీయ వ్యవస్థ కాదని.. లోకల్- నాన్ లోకల్ అనే వ్యాఖ్యలు తాము చేయలేదని చెప్పారు. మంచు విష్ణు కూడా తనతో మాట్లాడారని తెలిపారు.
నాగబాబు తనకు మంచి మిత్రుడని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. అయితే మా ప్రతిష్ఠ మసకబారిందని ఆయన అనడం మాత్రం సరికాదని, ఆయన మాటలు విని షాక్ అయ్యామని తెలిపారు. మా కోసం తాము చాలా కష్టపడ్డామని, ఆయన మాటలు తమను బాధపెట్టాయన్నారు. మాలో 914 మంది జీవితకాల సభ్యులు ఉన్నారని, అసోసియేట్ సభ్యులు 29 మంది ఉన్నారని నరేష్ చెప్పారు. మొత్తం 728 మందికి రూ.3 లక్షల చొప్పున జీవిత బీమా చేయించామన్నారు. 'మా'లో ఇంత మందికి ఎన్నడయినా బీమా చేయించారా? అని ప్రశ్నించారు. 16 మంది చనిపోతే సుమారు రూ.50 లక్షలు అందించామని తెలిపారు. ఆర్టిస్టుల పెన్షన్ ను కూడా తాము పెంచామని నరేష్ పేర్కొన్నారు.
![]() |
![]() |