![]() |
![]() |

యువతరం అభిమాన కథానాయకుడిగా ఎంతో క్రేజ్ తెచ్చుకొని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేకెత్తించి, 34 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అభిమానులందర్నీ విషాదంలో ముంచేశాడు ఉదయ్ కిరణ్. హీరోగా నటించిన తొలి 'చిత్రం'తోటే సూపర్ హిట్ సాధించి, ఆ తర్వాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' సినిమాలతో ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన ఆ యువకెరటం.. ఆ తర్వాత కెరీర్ పరంగా నెమ్మదించాడు. 2014 జనవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను నటించిన సినిమా 'చిత్రం చెప్పిన కథ' ఇంతదాకా విడుదలకు నోచుకోకపోవడం శోచనీయం.
తన గతానికి సంబంధించిన రహస్యాల్ని శోధించడానికి ప్రయత్నించే ఓ యువకుడి కథగా మిస్టరీ జానర్‌లో 'చిత్రం చెప్పిన కథ' రూపొందింది. మదాలసా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని మోహన్ అల్‌ర్క్ డైరెక్ట్ చేశాడు. మున్నా కాశి మ్యూజిక్ అందించాడు. 2015లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఆ తర్వాత మరోసారి 2017లో విడుదల చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చినా రిలీజ్ కాలేదు. ఆ సినిమా ఆడియో లాంచ్‌కు ఉదయ్ కిరణ్ భార్య, ఆమె కుటుంబసభ్యుల హాజరయ్యారు కూడా.
గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు సరిగా తెరుచుకోకపోవడం, మధ్యలో మూడు నెలల పాటు తెరుచుకున్నా.. ఈ సినిమాని విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలతో ఇంతదాకా రిలీజ్ కాలేదు. దీంతో నిర్మాతలు 'చిత్రం చెప్పిన కథ'ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై నేరుగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈరోజు ఉదయ్ కిరణ్ జయంతిని అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలోనైనా ఆ సినిమా విడుదలకు సంబంధించిన న్యూస్ బయటకు వస్తే బాగుండునని వారు ఆశిస్తున్నారు.
![]() |
![]() |