![]() |
![]() |
.jpg)
మహానటులు ఎన్టీఆర్ - ఏఎన్నార్ కాంబినేషన్ లో పలు మల్టిస్టారర్స్ రూపొందాయి. వాటిలో సింహభాగం విజయఢంకా మ్రోగించాయి. అలా.. ఘనవిజయం సాధించి క్లాసిక్స్‌గా నిలిచిన వాటిలో విజయావారి 'గుండమ్మ కథ' ఒకటి. ఈ సినిమా ఎన్టీఆర్ కి 100వ చిత్రం కాగా.. ఏఎన్నార్ కి 99వ సినిమా కావడం విశేషం. జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన కన్నడ చిత్రం 'మనె తుంబిద హెణ్ణు' (1958) ఆధారంగా రూపొందిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు. 'గుండమ్మ'గా టైటిల్ రోల్ లో సూర్యకాంతం నటించగా.. ఎన్టీఆర్ కి జోడీగా 'మహానటి' సావిత్రి, ఏఎన్నార్ కి జంటగా 'అభినేత్రి' జమున దర్శనమిచ్చారు. 'నటసార్వభౌమ' ఎస్వీ రంగారావు.. ఎన్టీఆర్ - ఏఎన్నార్ కి తండ్రిగా కనిపించారు. ఇతర ముఖ్య పాత్రల్లో హరనాథ్, ఎల్. విజయలక్ష్మి, ఛాయాదేవి, రుష్యేంద్రమణి, రమణారెడ్డి, రాజనాల అలరించారు.
సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అయితేనే సరిపోతారని డైరెక్టర్ కామేశ్వరరావు, స్క్రీన్‌ప్లే రైటర్ చక్రపాణి భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు, కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, "ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది" అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు. నిజంగానే అది తెలుగు పేరే అన్నంతగా పాపులర్ అయ్యింది.
ప్రముఖ గాయకులు ఘంటసాల సంగీతమందించిన ఈ చిత్రానికి పింగళి సాహిత్యమందించారు. "లేచింది నిద్ర లేచింది మహిళా లోకం", "ప్రేమయాత్రలకు", "అలిగిన వేళనే చూడాలి", "కనులు మూసినా నీవాయే", "మనిషి మారలేదు", "కోలో కోలోయన్న", "ఎంతహాయి ఈ రేయి", "మౌనముగా నీ మనసు పాడిన".. ఇలా ఇందులోని 8 పాటలు కూడా విశేషాదరణ పొందడం విశేషం. 1962 జూన్ 7న విడుదలై ఆయేటి మేటి చిత్రంగా జననీరాజనాలు అందుకున్న 'గుండమ్మ కథ'.. నేటితో 59వసంతాలు పూర్తిచేసుకుని 60లోకి అడుగుపెట్టింది.
![]() |
![]() |