![]() |
![]() |

'నీ కోసం' (1999), 'వెంకీ' (2004) వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ - స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ 'దుబాయ్ శీను'. 'వెంకీ' తరహాలోనే మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రవితేజకి జోడీగా నయనతార నటించింది. డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో బ్రోకర్ (వేణుమాధవ్) చేతిలో మోసపోయిన శ్రీనివాస్ అలియాస్ శీను (రవి తేజ) కథ ఈ చిత్రం. తన ఫ్రెండ్ చక్రి (జె.డి. చక్రవర్తి)ని తన కళ్లముందే హత్యచేసిన దుండగులకు అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, చక్రి చెల్లెలు మధుమతి (నయనతార) మనసును ఎలా గెలుచుకున్నాడనేది ప్రధానాంశం.
జెడీ ప్రేయసిగా నేహ నటించిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్, సుప్రీత్ విలన్లుగా నటించారు. ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, కృష్ణభగవాన్, వేణుమాధవ్, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, చిత్రం శ్రీను, ఏవీఎస్, మల్లికార్జునరావు నవ్వులు పంచారు. భానుచందర్, సాయాజీ షిండే, పృథ్వీరాజ్, సురేఖావాణి ఇతర కీలక పాత్రధారులు.
మెలోడీబ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. "కన్యారాశి కలువా" అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ మెలోడీ ప్రియులను అలరించింది. యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి చింతపల్లి రమణ సమకూర్చిన సంభాషణలు మరో ఆకర్షణగా నిలిచాయి. 7 జూన్ 2007న విడుదలై జననీరాజనాలు అందుకున్న 'దుబాయ్ శీను'.. నేటితో 14 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |