![]() |
![]() |

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తమ పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని పలువురు సినీ సెలెబ్రిటీలు వారి అభిమానులను కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని, ఆరోజు తనని కలవడానికి అభిమానులు ఎవరూ రావొద్దని కోరారు.
జూన్ 10న బాలకృష్ణ జన్మదినం. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాలలోని బాలయ్య అభిమానులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి భారీగా తరలి వచ్చి బర్త్ డే విషెష్ తెలియజేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి అభిమానులు తనని కలవడానికి రావొద్దని, ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా బాలయ్య కోరారు.
" ప్రతి ఏటా జూన్ 10 వతేదీ నా పుట్టినరోజు నాడు.. నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం.. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ .." అంటూ అభిమానులకు బాలయ్య సందేశం విడుదల చేశారు.
![]() |
![]() |