![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణకి అచ్చొచ్చిన కథానాయికల్లో అతిలోక సుందరి శ్రీదేవి ఒకరు. ఈ ఇద్దరి కలయికలో రూపొందిన పలు చిత్రాలు ప్రజాదరణ పొందాయి. వాటిలో `భోగభాగ్యాలు` ఒకటి. పి. చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో గుమ్మడి, గిరిబాబు, నూతన్ ప్రసాద్, రావికొండల రావు, శుభ, హలం, జయమాలిని, జ్యోతిలక్ష్మీ, శ్రీలక్ష్మి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి ఉషః శ్రీ కథను అందించగా.. మోదుకూరి జాన్సన్ సంభాషణలు సమకూర్చారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. `పచ్చ పచ్చాని చేలు` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``నా పేరు ముద్దుకృష్ణ``, ``ఇదిగిదిగోరా డింభకా``, ``చందమామ చందమామ`` గీతాలు కూడా అలరించేలా ఉంటాయి. యస్.ఎల్. మూవీస్ పతాకంపై యస్. పరంధామ రెడ్డి ఈ కుటుంబకథా చిత్రాన్ని నిర్మించగా.. పుష్పాల గోపీకృష్ణ ఛాయాగ్రహణం అందించారు. 1981 జూన్ 5న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `భోగభాగ్యాలు`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |