![]() |
![]() |

మరికొద్ది రోజుల్లో స్క్రీనింగ్ మొదలవుతుందనంగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈలమ్ తమిళులను అది చెడుగా చూపించిందనేది ఆరోపణ. ఈ సీజన్‌లో రాజీ అనే ఒక సూసైడ్ బాంబర్‌గా సమంత అక్కినేని నటించినట్లు ఈమధ్య విడుదల చేసిన ట్రైలర్‌లో కనిపించింది. దీంతో తమిళుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఆ సిరీస్‌ను నిషేధించాల్సిందిగా నిరసనలు వెల్లువెత్తాయి.
తమిళనాడు సమాచార-ప్రసార శాఖా మంత్రి మనో తంగరాజ్ సైతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఆ సిరీస్‌ను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర సమాచార-ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు.
వివాదం మరింత ముదరకుండా ఆ షో గురించి ఏమీ మాట్లాడవద్దని సమంత అక్కినేనికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఆదేశించింది. "సినిమాల్లోని లేదా వెబ్ సిరీస్‌లలోని కొన్ని పాత్రల చిత్రణపై తరచూ నిరసనలు వస్తూనే ఉంటాయి. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత చేసిన పాత్రపైనా అలాంటి నిరసనలే వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్‌లో ఆమె కనిపించిన తీరుచూసి దానిపై తమిళులు ఆగ్రహిస్తున్నారు. కానీ సిరీస్ మొత్తం చూస్తేనే కానీ ఆమె పాత్ర నిజంగా ఏమిటనేది తెలీదు." అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
రిలీజ్‌కు ముందు ఇలాంటి కాంట్రవర్సీలను ఎవాయిడ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ లాంటి కంటెంట్ క్రియేటర్స్ భావిస్తుంటారు. "సమంతకు ఇచ్చిన ఆదేశాలు అందులో భాగమే. ఆడియెన్స్ ఫీలింగ్స్, సెంటిమెంట్స్‌ను రెచ్చగొట్టకుండా ఉండటం మంచిది." అని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రధాన పాత్రధారి మనోజ్ బాజ్‌పేయి, డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ అంశంపై వివరణ ఇచ్చారు. యూనిట్ సభ్యుల్లో అత్యధికులు తమిళులేననీ, తమిళుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఎందుకు ఈ సిరీస్‌ను తీస్తామనీ వారు చెప్పారు. జూన్ 4న ఈ సిరీస్ విడుదలవుతోంది.
![]() |
![]() |