![]() |
![]() |

నటునిగా ఎన్టీ రామారావు కీర్తి కిరీటంలో కలికితురాళ్లలాంటి పాత్రల్లో సర్దార్ పాపారాయుడు ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన 'సర్దార్ పాపారాయుడు' చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులను సృష్టించింది. 1980లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై క్రాంతి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఉంది. కొంత షూటింగ్ అయ్యాక సినిమా వస్తున్న తీరు చూసి, పాపారాయుడు పాత్రపై ఇష్టం బాగా పెరిగింది ఎన్టీఆర్‌కు. అది చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని అనిపించింది. అందుకని, అంతదాకా అయిన ఖర్చును చెల్లించి, ఆ సినిమాను సొంతం చేసుకొని, తనే నిర్మించాలని అనుకున్నారు కానీ నిర్మాత క్రాంతి కుమార్ సున్నితంగా దాన్ని తోసిపుచ్చారు.
ఫస్ట్ షెడ్యూల్‌ను మద్రాసు విజీపీ గార్డెన్స్‌లో నిర్వహించారు. అక్కడ పాపారాయుడి భార్య సీత (శారద)ను విలన్లు వెంటాడి చంపడం, ఆమె దహన సంస్కారాల నిమిత్తం సంకెళ్లతో పాపారాయుడ్ని తీసుకురావడం, భార్య పార్థివ దేహానికి పాపారాయుడు నిప్పు పెట్టేముందరి హెవీ సీన్లు, సత్యమూర్తి (సత్యనారాయణ) స్మగుల్ చేస్తున్న పాలడబ్బాలను ఇన్‌స్పెక్టర్ రాము (ఎన్టీఆర్) అటకాయించడం, ఓ బీభత్సమైన ఫైట్.. ఇవన్నీ చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఎన్టీఆర్‌కు బాగా పెరిగింది.
"ఇప్పటివరకూ అయిన షూటింగ్‌కు రూ. 40 లక్షలు ఇస్తాను. పిక్చర్‌ను నేను పూర్తి చేసుకుంటాను. ఇస్తారేమో క్రాంతి కుమార్ గారిని కనుక్కోండి." అని తనకు సన్నిహితంగా ఉండే భూతాల రాజు అనే వ్యక్తిని పంపారు ఎన్టీఆర్. అతను వచ్చి క్రాంతికుమార్‌కు విషయం చెప్పాడు. ఆయన నవ్వి ఊరుకున్నాడే కానీ ఏ విషయమూ తేల్చి చెప్పలేదు.
ఈ తర్వాత రోజు షెడ్యూల్‌కు ఆఖరి రోజు. ఎన్టీఆర్ స్వయంగా క్రాంతికుమార్ సమక్షంలోనే "44 లక్షలు (4 పెంచారు) ఇస్తానన్నా ప్రొడ్యూసర్ గారు ఏమీ చెప్పడం లేదు." అంటూ క్యాజువల్‌గా అన్నట్లు అన్నారు. అప్పుడు క్రాంతికుమార్ "సార్.. ఈ విషయం హైదరాబాద్‌లో ఇంటికి వచ్చి మాట్లాడతాను." అని చెప్పారు. సరే.. రమ్మని చెప్పారు ఎన్టీఆర్.
షెడ్యూల్ అయ్యాక రామారావు గారు హైదరాబాద్ వచ్చేశారు. చెప్పినట్లే ఆయనను కలిశారు క్రాంతికుమార్. "సార్.. నా బేనర్‌లో మీరు చేస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇది. ప్రతి నిర్మాతకూ మీతో ఒక సినిమా అయినా చెయ్యాలనే కోరిక ఉంటుంది. నాకిద్దరు మగపిల్లలు. 'సర్దార్ పాపారాయుడు' నెగటివ్ వారికి స్థిరాస్తికింద ఉంటుంది. మీరు నా పిల్లలను ఆశీర్వదిస్తే.." అని ఆగిపోయారు క్రాంతికుమార్.
ఎన్టీఆర్‌కు ఆయన పరిస్థితి అర్థమైంది. "అలానే కానివ్వండి బ్రదర్.. ఈ విషయంలో రెండో ఆలోచనే వద్దు" అన్నారు. క్రాంతికుమార్ చాలా సంతోషంగా ఆయన దగ్గర్నుంచి సెలవు తీసుకున్నారు. అలా తన నిర్మాత కష్టసుఖాలను అర్థం చేసుకొనే హీరో కాబట్టే ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలందరూ చాలా హ్యాపీగా ఉండేవారు. 'సర్దార్ పాపారాయుడు' విడుదలై కనక వర్షం కురిపించి, క్రాంతికుమార్‌కు బ్రహ్మాండమైన లాభాలు అంందించింది. ఈ సినిమా డైలాగ్స్, సాంగ్స్ ఆడియో క్యాసెట్లు అప్పట్లో రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
(మే 28 ఎన్టీ రామారావు 99వ జయంతి)
![]() |
![]() |