![]() |
![]() |

చార్ట్ బస్టర్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి - మెలోడీబ్రహ్మ మణిశర్మ.. సుదీర్ఘ విరామం అనంతరం `ఆచార్య` కోసం జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `స్టాలిన్` (2006) తరువాత దాదాపు పదిహేనేళ్ళ గ్యాప్ తో చిరు - మణి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ `లాహే లాహే` పాట ఆ అంచనాలకు తగ్గట్టే అలరించింది. అయితే, ఈ సినిమాలో ఈ పాట కంటే ఆకర్షణీయమైన గీతం మరొకటి ఉందంట.
అటు వీనుల విందుగానే కాకుండా ఇటు కనువిందుగానూ సాగే రొమాంటిక్ నంబర్ ఇదని.. ఇందులో ప్రత్యేక పాత్రల్లో నటించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - `బుట్టబొమ్మ` పూజా హెగ్డేపై ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. వాస్తవానికి, కొద్ది రోజుల క్రితమే ఈ పాట తాలూకు ఆడియో లీక్ అయిందని కథనాలు వచ్చాయి. కట్ చేస్తే.. ఇప్పుడా పాటే సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా కానుందంటూ ప్రచారం జరుగుతుండడం విశేషం. మరి.. ఈ ప్రణయగీతం వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. `ఆచార్య`ని వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తుండగా.. ఇందులో చిరుకి జంటగా కాజల్ అగర్వాల్ సందడి చేయనుంది. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. అన్నీ అనుకూలిస్తే.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే అవకాశముంది.
![]() |
![]() |