![]() |
![]() |

సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు. ఆమె సినిమాటోగ్రఫీలో ట్రైనింగ్ అయ్యారు. స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. డైరెక్షన్ కూడా చేశారు. వీటన్నింటిలో ఆమెకు బాగా నచ్చింది నటులను డైరెక్ట్ చెయ్యడం. 1996లోనే ఆమె 'ఇందిర' అనే సినిమాను డైరెక్ట్ చేశారు. దాని తర్వాత ఆమె మళ్లీ డైరెక్టర్ సీట్‌లో కూర్చోలేదు. "ఎందుకు మళ్లీ డైరెక్షన్ చెయ్యలేదంటే మణిరత్నం భార్యని కావడం వల్లే. ఇంట్లో ఒక డైరెక్టర్ ఉంటే చాలని ఆయనన్నారు. ఆగిపోయాను. డైరెక్షన్ అనేది శారీరకంగా, మానసికంగా క్లిష్టమైన వ్యవహారం. అందుకే దాన్ని ఆయనకే వదిలేశాను. విమెన్ ఆర్ లైక్ దట్." అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొంటూ భారతీయ సినిమాని ప్రపంచ సినిమాకి చేరువ చేయాలని సుహాసిని కృషి చేస్తున్నారు. "ముఖ్యంగా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలనేది నా కోరిక. అందుకే అప్పుడుప్పుడు మనవాళ్లకు ఫోన్ చేస్తుంటా.. ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పమని." అని ఆమె అన్నారు.
నటిగా మొదట్లో 'అన్నీ నాకే తెలుసు' అనే పొగరుతో ఉండేదాన్నని సుహాసిని చెప్పారు. "కానీ తెలుగు చిత్రసీమలోకి వచ్చాకే నలుగురితో ఎలా నడచుకోవాలో, ఎలా క్రమశిక్షణతో ఉండాలో నేర్చుకున్నా. ఈ విషయాన్ని మణిరత్నం ముందు, మా బాబాయ్ కమల్ హాసన్ ముందు కూడా గట్టిగా చెబుతాను. నా కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ను ఇక్కడే గడిపా కాబట్టి తెలుగు సినిమాతో నా అనుబంధం గట్టిగా పెనవేసుకుపోయింది." అని ఆమె చెప్పుకొచ్చారు.
![]() |
![]() |