![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వితరణను చాటుకున్నారు. ఇటీవల సీనియర్ నటి పావలా శ్యామలకు రూ. 1,01,500 పెట్టి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వాన్ని ఇప్పించిన ఆయన, కరోనాతో మృతి చెందిన ఫిల్మ్ జర్నలిస్ట్-నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. లక్ష విరాళంగా అందచేశారు. అలాగే ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు బాధపడకుండా అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ఆయన యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించారు.
ఇప్పుడు తన కారవాన్ డ్రైవర్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇటీవల ఆయన కారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కొవిడ్‌తో బాధపడుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య శోభారాణి, ఇద్దరు కుమారులు కౌశిక్ (18), జస్వంత్ (12), కుమార్తె వినోదిని (8) ఉన్నారు. జయరామ్ మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో చిరంజీవి ఆయన కుటుంబాన్ని ఆదుకునే నిమిత్తం తక్షణ సాయం కింద లక్ష రూపాయల చెక్కును పంపించారు. జయరామ్ భార్యా పిల్లలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు చేతుల మీదుగా ఈ చెక్కును అందుకున్నారు.

ఈ సందర్భంగా జయరామ్ భార్య శోభారాణి మాట్లాడుతూ, "చిరంజీవి గారు అన్నివేళలా ఆపద్భాందవుడు. ప్రతిసారీ మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. ఇంతకుముందు మా వారు (జయరామ్) బైక్ పై వెళుతూ యాక్సిడెంట్ కి గురయ్యారు. వెంటనే ఉపాసన గారికి ఫోన్ చేసి వైద్య సహాయం అందించారు. అప్పుడు మా కుటుంబానికి ఆర్థిక కష్టం లేకుండా ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది నా పిల్లలకు పెద్ద సాయం. చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు." అని అన్నారు.
![]() |
![]() |