![]() |
![]() |
.jpg)
'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. మొదట ఆ సీరియల్‌తో తెలుగువారి లోగిళ్లలోకి వచ్చిన ఆమె, 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది 3' సినిమాల్లో నటించింది. హైదరాబాద్‌లోన ఓ ఎన్జీవోను నడుపుతున్న మిళింద్ చంద్వానీతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇటీవల ఒక చాట్ షోలో పాల్గొన్న ఆమె మిళింద్‌కు తానెలా ప్రపోజ్ చేసిందీ, తమ పెళ్లి ప్లాన్లు ఏమిటనేవి పంచుకుంది.
మిళింద్ చంద్వానీ నడుపుతున్న ఎన్జీవో పేరు 'క్యాంప్ డైరీస్'. అతను సామాజిక కార్యకర్త కూడా. హైదరాబాద్‌లో జరిగిన ఓ గెట్-టుగెదర్‌లో ఆ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ క్షణమే అతడిపై ఆమెకు ఇష్టం కలిగింది. "అయితే అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది కాదు. సౌత్ సినిమాల్లో ఎలాగైతే హీరోపై హీరోయిన్ తన ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తే, హీరో రియలైజ్ అయ్యి, ఆమె ప్రేమను ఎలా అంగీకరిస్తాడో, సరిగ్గా అలాగే మిళింద్, నాకూ మధ్య జరిగింది." అని చెప్పింది అవిక.
ఇప్పుడే పెళ్లికి తొందర ఏమిటనేది అవిక అభిప్రాయం. అయితే మిళింద్ కనుక పెళ్లి చేసుకుందామని అడిగితే రెండో ఆలోచన చెయ్యనని చెప్పేస్తోంది. "నేనింకా చిన్నదాన్నే కదా. కానీ, మిళింద్ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుందామన్నా, లేదూ రేపే చేసుకుందామన్నా, నేను రెడీ." అని ఆమె తెలిపింది.

ముంబై నుంచి వచ్చిన అవిక, హైదరాబాద్‌లోనే నివాసం ఉండాలని డిసైడ్ చేసుకుంది. ఆఖరుకి తన అమ్మానాన్నల్ని కూడా తనతో పాటే హైదరాబాద్‌లో ఉండమని కోరింది. "హైదరాబాద్‌లో నేను వరుసగా సినిమాలు చేస్తున్నా. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా సహ నిర్మాతగా సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నా. పోయిన సంవత్సరం నాలుగు సినిమాలు చేస్తే, వాటిలో రెండు నేను సహ నిర్మాతగా చేసినవే. మరో నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి." అని చెప్పింది అవిక.
ప్రస్తుతం ఆమె నాగచైతన్య సినిమా 'థ్యాంక్ యు'లో ఓ నాయికగా నటిస్తూ, చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ సరసన మరో సినిమా చేస్తోంది.
![]() |
![]() |