![]() |
![]() |

నటుడిగా పెద్ద పేరు ప్రఖ్యాతులు లేకపోయినా ఎదుటివారి కష్టాన్ని తీర్చడంలో మాత్రం పెద్ద మనసును చూపిస్తున్నాడు జీవన్ కుమార్. కరోనా కష్టకాలంలో రోజూ 300కి పైగా కరోనా రోగులకు ఆకలి తీరుస్తూ టాలీవుడ్ సోను సూద్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా సీనియర్ నటి పావలా శ్యామలా పరిస్థితి తెలుసుకొని చలించిపోయిన జీవన్ కుమార్ ఆమెకు చేయూతనిచ్చాడు. పావలా శ్యామల ఇంటికి వెళ్ళి ఆమె పడుతున్న కష్టాలను చూసి, కొన్ని అవసరమైన నిత్యావసరాలతో పాటు పదివేల రూపాయలు ఆమె అవసరాలకు అందించాడు. వారింటిలో ఎవరూ రోజువారీ పనులు చేసుకునే పరిస్థితిలో లేరని గమనించి వారింటికి రోజూ భోజనం పంపుతానని , ఏ సహాయం కావాలన్నా ముందుంటానని హామీ ఇచ్చాడు. జీవన్ ఎవరో తెలియకపోయినా తన పరిస్థితికి స్పందించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు పావలా శ్యామల. జీవన్ వంటి వ్యక్తుల వలన తనకు ఎంతో మనో ధైర్యం వస్తోందని ఆమె అన్నారు.
ఇదే తరహాలో ఇటీవల కరోనాతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి కూడా సహాయంగా నిలిచాడు జీవన్ కుమార్. టీఎన్ఆర్ ఆకస్మిక మరణం వారి కుటుంబ జీవనచిత్రాన్ని మార్చివేసింది. ఆయన కుటుంబానికి అండగా నిలబడేందుకు జీవన్ ముందుకు వచ్చాడు. టిఎన్ఆర్ సతీమణి జ్యోతిని పరామర్శించి 50 వేల రూపాయులు తన వంతు సహాయం అందించాడు.

ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ, "పావలా శ్యామల గారి పరిస్థితి చూసి చాలా బాధ వేసింది. అంత సీనియర్ నటి ఇలాంటి పరిస్థితిలో ఉండటం చాలా విచారకరం. అందుకే నావంతుగా సహాయం చేశాను. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ముందు నిలబడేందుకు సిద్ధంగా ఉంటాను. టీఎన్ఆర్ గారు నాకు జర్నలిస్టుగా బాగా ఇష్టమైన వ్యక్తి. ఆయన మరణం నన్ను కలిచివేసింది. వారి సతీమణి జ్యోతిగారితో మాట్లాడుతుంటే నేను తట్టులేకపోయాను. వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాను." అన్నారు.

![]() |
![]() |