![]() |
![]() |
.jpg)
సీనియర్ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్ (డీఎండీకే) వ్యవస్థాపకుడు అయిన విజయకాంత్ తనకు ఊపిరి సరిగా అందడం లేదని ఫిర్యాదు చేయడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనను బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. హాస్పిటల్ వర్గాల నుంచి అప్డేట్స్ అందాల్సి ఉంది.
గత కొన్నేళ్లుగా విజయకాంత్ పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున తనకు శ్వాస సరిగా ఆడటం లేదని చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తోంది. జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు ఆయన పార్టీ ఓ ప్రకటన చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నారు. హాస్పిటల్ వర్గాలు మాత్రం ఇంతదాకా ఏ విషయమూ వెల్లడించలేదు.
2020 సెప్టెంబర్‌లో విజయకాంత్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ లక్షణాలతో ఇబ్బందిపడ్డ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన భార్య ప్రేమలత సైతం కొవిడ్ 19 బారిన పడ్డారు. హాస్పిటల్లో కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆ ఇద్దరూ అక్టోబర్ 2న డిశ్చార్జయి ఇంటికి వచ్చారు.
తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకూ విజయకాంత్ సుపరిచితులే. సింధూరపువ్వు, కెప్టెన్ ప్రభాకర్, క్షత్రియుడు లాంటి డబ్బింగ్ సినిమాలు ఆయనను తెలుగువారికి దగ్గరచేశాయి.
![]() |
![]() |