![]() |
.jpg)
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్న సందర్భంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపవద్దనీ, అందరూ ఇంటిపట్టునే క్షేమంగా ఉండాలనీ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన కూడా కొవిడ్-19తో బాధపడుతూ స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందనే విషయం ఈనెల 10న తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆయన వెల్లడించారు.
మే 20 ఆయన పుట్టినరోజు. మామూలుగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమాన సంఘాలు ఆరోజున ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాయి. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. గత ఏడాది కూడా లాక్‌డౌన్ కారణంగా ఆయన పుట్టినరోజును వేడుకగా అభిమానులు జరుపుకోలేకపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కొవిడ్ ఉధృతి నాలుగు రెట్లు తీవ్రంగా ఉంది. అందుకే బుధవారం ఆయన తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అభిమానుల కోసం ఓ నోట్‌ను షేర్ చేశారు.
ప్రస్తుతం తను బాగున్నాననీ, త్వరలోనే కోలుకొని కొవిడ్‌ను జయిస్తాననీ ఆయన అందులో తెలిపారు. "ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటిపట్టునే ఉంటూ, లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తాను. ఇదే మీరు నాకు అందించే అతిపెద్ద కానుక." అని తారక్ రాసుకొచ్చారు.
ఇది వేడుకలు చేసుకొనే సమయం కాదని ఆయన ఫ్యాన్స్‌కు చెప్పారు. "మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మనదేశం ఈ కరోనాను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం." అని ఆయన ఆ నోట్‌లో తెలిపారు.

![]() |