![]() |
![]() |

సీనియర్ నటుడు రాధారవిపై సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి విమర్శలు గుప్పించారు. లేటెస్ట్‌గా ఒక సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను రాధారవి నిషేధించాడనీ, ఆయన అరాచకాలకు అంతం అనేది లేకుండా పోయిందనీ ఆమె ఆరోపించారు. ఎంత కాలం ఆయనను భరించాలని ఆమె ప్రశ్నించారు. శనివారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమె రాధారవి చర్యను ఖండించారు.
"మిస్టర్ రాధారవి మళ్లీ ఒక వెటరన్ డబ్బింగ్ ఆర్టిస్టును నిషేధించి, ఆ ఆర్టిస్టుకు సహకరించవద్దని అన్ని స్టూడియోలకు నాన్-కోపరేషన్ నోటీస్ పంపాడు. ఈ మనిషి దురాగతాలకు అంతం లేకుండా ఉంది. ఈ స్వతంత్ర దేశంలో ఎవరినైనా పని నుంచి బ్యాన్ చేయడానికి ఎంత ధైర్యం?! ఈ చెత్తను మనం ఎంత కాలం భరించాలి?!" అని ఆమె రాసుకొచ్చారు.
"మి టూ" ఉద్యమం నడుస్తున్న కాలంలో రాధారవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా చిన్మయి వార్తల్లో నిలిచారు. అయితే దీనితో ఆమె క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిందనే అభియోగంతో ఆమెను సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ నుంచి బహిష్కరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ యూనియన్‌కు అధ్యక్షుడిగా రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా ఆయన ఓ డబ్బింగ్ ఆర్టిస్టును నిషేధించడంతో చిన్మయి మరోసారి ఆయన తీరుపై విమర్శలు గుప్పించారు.
![]() |
![]() |