![]() |
![]() |

శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా నటించే సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ కాంబినేషన్‌తో నిర్మాతగా తన 50వ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే 'ఇండియన్ 2' మూవీని పూర్తి చేయకుండా వేరే ఏ సినిమాలనూ శంకర్ డైరెక్ట్ చేయకుండా చూడమంటూ లైకా ప్రొడక్షన్స్ తమిళనాడు హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసును జస్టిస్ సంజిబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తిలతో కూడిన బెంచ్ గురువారం విచారించింది.
ఈ సందర్భంగా శంకర్ తరపున వాదనలు వినిపించిన లాయర్, తమ డైరెక్టర్ ఓ తెలుగు సినిమాని డైరెక్ట్ చేయడానికి సంతకం చేశారనీ, రామ్‌చరణ్ హీరోగా నటించే ఆ సినిమా షూటింగ్ 2022 మేలో మొదలవుతుందనీ, ఈలోగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఐదు నెలల కాలంలో 'ఇండియన్ 2' మూవీని శంకర్ పూర్తి చేస్తారనీ వెల్లడించారు.
'ఇండియన్ 2' నిర్మాణ సంస్థ శంకర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిందనీ, వాటిని ఉపసంహరించుకోవాలనీ శంకర్ తరపు లాయర్ డిమాండ్ చేశారు. ఇండియన్ 2లో వివేక్ కూడా నటిస్తున్నారనీ, మరికొన్ని సీన్లు ఆయనపై తీయాల్సి ఉందనీ, కానీ ఆయన ఆకస్మికంగా మృతి చెందడం వల్ల ఆయనకు సంబంధించిన సీన్లు మరో నటుడితో రిషూట్ చేయాల్సి ఉందని కూడా లాయర్ తెలిపారు.
మరోవైపు లైకా ప్రొడక్షన్స్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, శంకర్‌కు ఇప్పటికే తమ క్లయింట్ రూ. 32 కోట్లు చెల్లించారనీ, మిగతా డబ్బును కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారనీ చెప్పారు. 2020 మార్చిలోనే 'ఇండియన్ 2' షూటింగ్ పూర్తి కావాల్సి ఉందనీ, కానీ ఇప్పటి దాకా పూర్తి కాకపోవడంతో భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారనీ తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సత్వరమే చిత్ర నిర్మాణాన్ని కొనసాగించడానికి తమ క్లయింట్ రెడీగా ఉన్నారని చెప్పారు.
కోర్టు ఉత్తర్వు సమస్యకు పరిష్కారం చూపదనీ, ఇరు వర్గాలూ సమావేశమై ఓ పరిష్కారాన్ని కనిపెట్టాలనీ న్యాయమూర్తులు సూచించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 28కు వాయిదా వేశారు.
![]() |
![]() |