![]() |
![]() |
.jpg)
పద్దెనిమిదేళ్ల క్రితం ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అది.. ఆంధ్రభూమి జర్నలిస్ట్ ఎండి అబ్దుల్‌పై పవన్ కల్యాణ్ చేయి చేసుకున్న దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితి. 2003 ఏప్రిల్‌లో జరిగిన ఆ ఘటన తర్వాత చిరంజీవి కుటుంబం చాలా రోజుల పాటు వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆనాటి ఘటనను ఇప్పుడు అబ్దుల్ ఓ వీడియో ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చారు. అయితే తనపై పవన్ కల్యాణ్ చేయి చేసుకోవడంపై ఆయన ఎలాంటి బాధను వ్యక్తం చేయకపోగా, అది తనకు ఆనందకరమే అన్నట్లు చెప్పడం గమనించాల్సిన విషయం.
"ఆ ఘటన మంచికి జరిగిందో, చెడుకు జరిగిందో దేవునికే ఎరుక. నా వరకైతే మంచికే జరిగిందనుకుంటాను. దాంతో నేను కూడా హీరో అయిపోయాను. పవన్ కల్యాణ్ కొట్టడం నాకు ఆనందమే అనిపించింది." అని తెలిపారు అబ్దుల్. తాను చిరంజీవి అభిమానినని ఆయన చెప్పారు. "అప్పుడు వాళ్లింట్లో ఓ శుభకార్యం జరుగుతుంటే మా (ఆంధ్రభూమి) ఫొటోగ్రాఫర్‌ను పంపాను. పవన్ కల్యాణ్ మా ఫొటోగ్రాఫర్ మీద చేయిచేసుకొని, కెమెరా లాక్కున్నాడు. నేను ఫొటోగ్రాఫర్‌కు మేం వచ్చేదాకా లోపలికి వెళ్లొద్దని చెప్పాను. కానీ అతను మేం వచ్చేలోగానే లోపలికి దూరేసిండు. ఇతన్ని చూసి ఆ ఈవెంట్ అఫిషియల్ ఫొటోగ్రాఫర్ పవన్ కల్యాణ్‌కు కంప్లయింట్ చేశాడు. ఆయన సీరియస్ అయ్యి, మా ఫొటోగ్రాఫర్‌ను కొట్టి, కెమెరా గుంజుకుని, బయటకు వెళ్లగొట్టిండు. అప్పుడు నాకు ఫోన్ చేసిండు ఫొటోగ్రాఫర్. నేను మా రిపోర్టర్‌ను తీసుకొని అక్కడకు వెళ్లాను." అని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి ఇంట్లోకి వెళ్లడానికి పర్మిషన్ లేదు కాబట్టి బయటనే నిలబడ్డామని అబ్దుల్ తెలిపారు. "కాసేపటికి పవన్ కల్యాణ్ బయటకు వచ్చారు. నన్నూ, ఫొటోగ్రాఫర్‌ను చూసి పిలిచాడు. "ఎందుకొచ్చారు?" అని అడిగారు. "కవరేజ్ కోసం వచ్చాం, వద్దంటే వెళ్లిపోతాం కదా.." అని నేనన్నాను. ఆమైనే ఆయన చేత్తో కొట్టాడు. నేను నా చేతుల్ని అడ్డం పెట్టాను. నేను స్లిప్పయి కిందపడ్డాను. ఆయన సెక్యూరిటీ వాళ్లకు "చంపెయ్యండి నా కొడుకుల్ని" అని చెప్పి, మళ్లీ లోపలికి వెళ్లిపోయారు. సెక్యూరిటీ వాళ్లకు "నేను జర్నలిస్టుని. నా మీద చేయివేస్తే ఆయనకే కాదు, మీక్కూడా ప్రాబ్లెమ్ ఉంటుంది." అని చెప్పా. వాళ్లు వెనక్కి తగ్గారు. ఈ ఘటనపై మేం కేసు పెట్టడం జరిగింది. సారీ చెబితే కేసు వెనక్కి తీసుకుంటామని మా మేనేజ్‌మెంట్ చెప్పింది. ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని మేనేజ్‌మెంటే డీల్ చేసింది. స్నేహపూర్వక వాతావరణంలో అందరం రాజీపడ్డాం. అప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. ఏ హీరో అభిమానులైనా అలాగే చేస్తారు కదా." అని చెప్పుకొచ్చారు అబ్దుల్.
![]() |
![]() |