![]() |
![]() |
.jpg)
కార్తికేయ గుమ్మకొండ హీరోగా వచ్చిన మరో సినిమా 'చావు కబురు చల్లగా' అతని కెరీర్‌లో మరో ఫ్లాప్ ఫిల్మ్‌గా నమోదైంది. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా రోల్‌లో అతను ఈ మూవీలో కనిపించాడు. 'స్వర్గపురి వాహనము'ను నడిపే డ్రైవర్ బస్తీ బాలరాజు క్యారెక్టర్‌లో నటుడిగా తనను తాను మరింతగా ఎక్స్‌ప్లోర్ కావడానికి ట్రై చేశాడు. కానీ కథాంశం తెలుగువారికి యాంటీ సెంటిమెంట్ కావడం పెద్ద మైనస్ అయ్యింది.
భర్త చనిపోయి అతని శవం దగ్గర పుట్టెడు దుఃఖంలో ఉన్న మల్లిక (లావణ్యా త్రిపాఠి) అనే యువతిని తొలిచూపులోనే ప్రేమించేసి, అప్పట్నుంచే ఆమె వెంటపడి వేధించే అతని క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఏమాత్రం మెచ్చలేకపోయారు. వితంతువును పెళ్లాడటం ప్రోగ్రెసివ్ అవుతుంది కానీ, వేదనాభరిత హృదయంతో ఉన్న ఆమెను వెంటపడి వేధించడం ఏ రకంగానూ ప్రోగ్రెసివ్ అనిపించుకోదనే విషయాన్ని డెబ్యూ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి గ్రహించలేకపోయాడు. అందుకే మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరో ఫ్లాప్‌గా నిలిచింది. అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించాడు. ఇటీవలి కాలంలో ఆ బ్యానర్ నుంచి వచ్చిన డిజాస్టర్ ఫిల్మ్ ఇదే.
కాగా ఈ సినిమాలో జరిగిన తప్పుల్ని క్షమించేసి, తనకు ఇంకో చాన్స్ ఇవ్వమని వేడుకుంటున్నాడు కార్తికేయ. సోమవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అతను పెట్టిన పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
"నాలో ఓ కొత్త నటుడ్ని 'చావు కబురు చల్లగా' ఎక్స్‌ప్లోర్ చేసింది. చాలా మంది హృదయాలకు నన్ను చేరువ చేసింది. మీ మెసేజ్‌లు చదివాక బస్తీ బాలరాజుగా చేసినందుకు గర్విస్తున్నాను. మూవీ నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించేసి ఇంకొక చాన్స్ ఇవ్వండి. కచ్చితంగా సరిదిద్దుకొని మళ్లీ వస్తాను." అని అతను ట్వీట్ చేశాడు. ఆ పోస్ట్‌కు స్పందించిన అతని ఫ్యాన్స్.. "సినిమా బాగా లేకపోయినా నీ యాక్టింగ్ బాగుందన్నా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సాధారణంగా ఏ హీరో కూడా తాను తప్పు చేశాననీ, క్షమించమనీ అడగడు. కానీ కార్తికేయ నిజాయితీగా, ధైర్యంగా తన తప్పుని ఒప్పుకొని క్షమించమని అడిగాడనీ, తప్పుల్ని సరిదిద్దుకొని మళ్లీ వస్తానని నమ్మకంగా చెప్పాడనీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |