![]() |
![]() |

శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం, మావిడాకులు వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు ఆమని. గత కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఆమె ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆమె నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'చావు కబురు చల్లగా'. ఇందులో హీరో కార్తికేయకు తల్లిగా గంగమ్మ పాత్రలో ఆమె నటించారు.
కొంత మాస్ టచ్‌తో ఆమె పాత్ర సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమని ఒకప్పటి తన స్నేహితురాలు సౌందర్య గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. సౌందర్య ఎక్స్‌పోజింగ్ ఎందుకు చేయలేదు? ఆ విషయంపై సౌందర్య తనతో ఏమందీ? .. హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నా తను చిరుతో ఎందుకు నటించలేకపోయింది? వంటి విషయాల్ని వెల్లడించారు ఆమని.
అమని, సౌందర్య ఇద్దరూ బెంగళూరుకు చెందిన కన్నడ తారలు కావడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. ఏ విషయమైనా ఇద్దరూ పంచుకునేవారట. ఒక సందర్భంలో "నువ్వు ఎక్స్‌పోజింగ్ ఎందుకు చేయవే" అని ఆమని అడిగితే "మన సినిమాలు మన కుటుంబ సభ్యులు కూడా చూస్తారు. భవిష్యత్తులో భర్త, పిల్లలు కూడా చూస్తారు. ఇప్పుడు డబ్బుల కోసం ఎక్స్‌పోజింగ్ చేస్తే రేపు వాళ్లు ఎందుకిలా చేశావ్ అని అడిగితే ఏం సమాధానం చెబుతాం?" అని అందని తాజా ఇంటర్వ్యూలో తెలిపారు ఆమని.
ఇక మెగాస్టార్‌తో నటించకపోవడానికి కారణం వివరించారు. 'రిక్షావోడు' చిత్రంలో చిరుతో కలిసి నటించాల్సింది. అయితే దర్శకుడు మారడంతో తనని ఆ సినిమా నుంచి తీసేశారట. అలా తను చిరుతో కలిసి నటించే అవకాశం మిస్సయ్యానని తెలిపారు ఆమని.
![]() |
![]() |