![]() |
![]() |

శేఖర్ కమ్ముల సినిమా 'లవ్ స్టోరి'లో సాయిపల్లవిపై చిత్రీకరించిన "సారంగ దరియా" పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా నిలిచింది. పవన్ సిహెచ్. మ్యూజిక్ అందించగా, సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ పాటను సంగీత ప్రియులు అమితంగా ఇష్టపడుతున్నారు. తెలంగాణలో బాగా పాపులర్ అయిన "సారంగ దరియా" పాటలోని పల్లవిని తీసుకొని, చరణాలు పూర్తిగా మార్చి, ఈ పాటను రాశారు అశోక్‌తేజ. అనవసరమైన కాంట్రవర్సీ కూడా ఈ పాట పాపులారిటీకి కారణమని చెప్పవచ్చు.
ఫిబ్రవరి 28న సమంత అక్కినేని చేతుల మీదుగా విడుదలైన ఈ పాట ఆదివారం నాటికి అంటే 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసి, ప్రస్తుతం 52 మిలియన్ ప్లస్ వ్యూస్ మీద ఉంది. ఇండియాలో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ సాంగ్ కూడా సాయిపల్లవి పేరిటే ఉండటం గమనార్హం. ధనుష్‌తో కాలిసి ఆమె డాన్స్ చేసిన తమిళ సాంగ్ "రౌడీ బేబీ" అయితే 8 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకుంది.
టాలీవుడ్‌కు సంబంధించిన ఇప్పటిదాకా బన్నీ-పూజా హెగ్డే సాంగ్ "బుట్టబొమ్మ"దే రికార్డ్. 'అల.. వైకుంఠపురములో'ని ఆ పాట 18 రోజులకు 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు నాలుగు రోజుల ముందుగానే ఆ పాట రికార్డును "సారంగ దరియా" తుడిచి పెట్టేసింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఎప్పట్లా తన ఫాస్టెస్ట్ అండ్ క్యూట్ మూవ్స్‌తో సాయిపల్లవి ఈ పాటకు తెరపై జీవం పోసింది.
నాగచైతన్య హీరోగా నటించిన 'లవ్ స్టోరి' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సాయిపల్లవి చేసిన రెండో సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన 'ఫిదా' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ సినిమాలో సాయిపల్లవి డాన్స్ చేసిన "వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే.." పాట ఇప్పటిదాకా 295 మిలియన్ వ్యూస్ సాధించడం విశేసం. సందర్భవశాత్తూ ఆ పాటను రాసింది కూడా సుద్దాల అశోక్‌తేజనే!
![]() |
![]() |