![]() |
![]() |

'జాతిరత్నాలు' దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర మిగతా సినిమాలన్నీ చిన్నబోతున్నాయి. మునుపటి వారం విడుదలైన సినిమాలతో పాటు, మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన మిగతా సినిమాలు 'జాతిరత్నాలు' ప్రభంజనం ముందు విలవిలలాడుతున్నాయి. మౌత్ టాక్ బాగానే ఉన్న శర్వానంద్ సినిమా 'శ్రీకారం' సైతం బ్రేకీవెన్ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి.
నాలుగో రోజు 'జాతిరత్నాలు' మూవీ తొలి మూడు రోజుల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి మీడియం బడ్జెట్ సినిమాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగో రోజు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.33 కోట్ల షేర్‌ను (అంచనా) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విడుదలయ్యాక ఈ సినిమాకు సంబంధించి ఒకరోజు షేర్‌లో ఇదే హయ్యెస్ట్.
అలాగే మునుపటి బ్లాక్‌బస్టర్ మూవీ 'ఉప్పెన' నాలుగో రోజు కలెక్షన్‌ను కూడా 'జాతిరత్నాలు' దాటేసింది. 'ఉప్పెన'కు నాలుగో రోజు వచ్చిన షేర్ రూ. 4.17 కోట్లు. మీడియం బడ్జెట్ మూవీస్‌కు సంబంధించి నాలుగో రోజు షేర్ విషయంలో పూరి జగన్నాథ్-రామ్ కాంబినేషన్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'దే ఇప్పటిదాకా రికార్డ్. అది రూ. 4.81 కోట్ల షేర్ సాధించింది. అంటే.. 'జాతిరత్నాలు' ఆ సినిమాను కూడా దాటేసి, సరికొత్త రికార్డ్ సృష్టించింది.
ఓవరాల్‌గా నాలుగు రోజులకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.52 కోట్ల షేర్ (అంచనా) సాధించి టాలీవుడ్ వర్గాలను అమితాశ్చర్యానికి గురిచేసింది. ఈ రాష్ట్రాల్లో దీని ప్రి బిజినెస్ వాల్యూ రూ. 9.45 కోట్లు. దీన్ని బట్టి నాలుగో రోజుకే బయ్యర్లు ఏ రేంజ్‌లో లాభాలు అందుకుంటున్నారో ఊహించుకోవచ్చు. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఫ్రేమ్‌లోనూ నవ్విస్తుండటమే ఈ సినిమా అసాధారణ విజయానికి కారణం.
![]() |
![]() |