![]() |
![]() |

జగమెరిగిన దర్శకుడు జంధ్యాల మన మధ్య లేకుండా పోయి సుమారు రెండు దశాబ్దాలవుతోంది. అయినా ఇప్పటికీ టీవీలోనో, యూట్యూబ్‌లోనో ఆయన సినిమాలను చూస్తూ, హాయిగా నవ్వుకుంటూ ఆరోగ్యాన్ని పొందుతూనే ఉంటున్నాం. సినిమాల గురించి తెలిసిన వాళ్లకు జంధ్యాల ఇండస్ట్రీలోకి రచయితగా వచ్చి, దర్శకుడిగా ఎదిగారని తెలుసు. ఆ తర్వాత నటుడిగానూ 'ఆపద్బాంధవుడు'లో కనిపించారనీ తెలుసు. కానీ ఆయన కుటుంబం గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువమందికి. ఆ మాటకొస్తే, ఇండస్ట్రీలోని చాలా మందికి తెలీదు.
పెళ్లయ్యాకే మద్రాస్ వెళ్లి సినిమాల్లో చేరిన జంధ్యాల.. 1996లో భార్య అన్నపూర్ణతో హైదరాబాద్ వచ్చేశారు. 1997లో కవల పిల్లలు సాహితి, సంపద పుట్టారు. కానీ వారిని ఆలనా పాలనా చూడకుండానే 2001 జూన్‌లో ఆయన కన్నుమూశారు. అప్పట్నుంచీ కుమార్తెలను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు అన్నపూర్ణ.
సాహితి, సంపద ఒక నిమిషం తేడాతో పుట్టిన కవలలు. జంధ్యాల మృతి చెందే నాటికి ఆ పిల్లలకు నాలుగో ఏడు నడుస్తోంది. అంటే ఇప్పుడు 24 ఏళ్ల వయసులోకి వచ్చారు. సాహితి ఇంజనీరింగ్‌లో ఆర్కిటెక్చర్ పూర్తిచేసి జాబ్ చేస్తుంటే, సంపద ఎంబీఏ చదువుతోంది. ఊహ తెలీని నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోవడంతో వాళ్లకు తండ్రి గురించి జ్ఞాపకాలు తల్లి ద్వారానే తెలుసు. అలాగే అమ్మ తరపు బంధువులు కూడా ఆయనతో వారి అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. నాన్న లేని లోటు తెలీకుండా అమ్మ తమను పెంచి పెద్దచేసిందని సాహితి, సంపద చెబుతారు.
తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాల్ని తరచూ చూసి వాళ్లు కూడా హాయిగా నవ్వేసుకుంటూ ఉంటారు. అయితే 'అహ నా పెళ్లంట', 'చంటబ్బాయ్' తమ ఫేవరేట్ మూవీస్ అని వారంటారు. జంధ్యాల లేకపోయినా ఆయన పేరిట ప్రతి ఏటా హాస్య ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయ్. వాటికి ఇద్దరు కుమార్తెలను తీసుకొని అన్నపూర్ణ వెళ్తూనే ఉంటారు. అక్కడ తండ్రి గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటే విని ఆనందిస్తుంటారు సాహితి, సంపద.
![]() |
![]() |