![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారునిగా పరిచయమైన చిత్రం 'రామాయణం'. అందరూ పిల్లలతో గుణశేఖర్ రూపొందించిన ఆ చిత్రంలో శ్రీరామునిగా నటించాడు తారక్. ఆ తర్వాత అతను "నిన్ను చూడాలని" చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నటించాడు. అతడికి తన తాతయ్య నందమూరి తారకరామారావు అంటే ఎనలేని ప్రేమ, భక్తి. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్‌గా తారక్‌ను పరిచయం చేసింది సీనియర్ ఎన్టీఆర్. ఆయన టైటిల్ రోల్ పోషించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో భరతుని పాత్రను తారక్ చేత చేయించారు ఎన్టీఆర్.
తాతయ్య మీద ఎంత ప్రేమ ఉన్నా ఆయన బయోపిక్‌లో, ఆయన పాత్రను చేయనంటే చేయనని తేల్చి చెప్పాడు తారక్. కొంత కాలం క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, "నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మా తాతగారు. ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే ఆయన పాత్రనే చేయాలి. ఆయన పాత్రను చేయడమంటే మాటలా. నా వల్ల కాదు. భయం. ఎన్నటికీ చేయను. ఇంకెవరైనా దాన్ని చేయాలనుకుంటే నాకేం అభ్యంతరం ఉండదు. ఎందుకంటే రామారావుగారు ఏ ఒక్కరి ఆస్తి కాదు. ఆయన తెలుగుజాతి ఆస్తి. ఈ దేశపు ఆస్తి." అని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత కొద్ది కాలానికే ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన తనయుడు బాలకృష్ణ చేశారు. 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' పేర్లతో రెండు భాగాలుగా విడుదలైన ఆ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేశారు. కానీ ఆ రెండు సినిమాలూ, ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం.
![]() |
![]() |