![]() |
![]() |

కృతి శెట్టిని చూసి మిగతా తారలు ఈర్ష్య పడుతున్నారు. కారణం.. హీరోయిన్గా మొదటి సినిమా 'ఉప్పెన' ఇంకా రిలీజ్ కాకముందే ఆమెకు వెల్లువెత్తుతున్న అవకాశాలు. మళ్లీ ఆమె డేట్స్ దొరుకుతాయో, లేదోనని ముందస్తుగానే ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. 'ఉప్పెన'కు సంబంధించిన టీజర్, ట్రైలర్, స్టిల్స్ వంటి వాటిలో ఆమె తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. టీజర్లో ఆమె హీరోను చూసి కంటిని పైకీ కిందికీ ఆడించిన తీరు చూసి కుర్రకారు మనసు పారేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే తొలి సినిమా రిలీజ్ కాకుండానే ఆమె కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోయింది!
ఇటీవల 'ఉప్పెన' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు లంగా వోణీ డ్రస్సులో వచ్చి మెరిసిపోయింది. ఆమె నుంచి చూపు తిప్పుకోవడం ఎవరి వల్లా కాలేదు. ఆ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ సైతం ఆమె అందచందాలకు మురిసిపోయారు. "ఇప్పుడే ఆమె డేట్స్ బుక్ చేసుకోండి. లేకపోతే తర్వాత దొరకడం కష్టమే." అని కామెంట్ చేయడం ఇందుకు ఓ నిదర్శనం. ఉప్పెన సినిమా విడుదలకు ముందే క్రేజ్ ఇలా ఉంటే, అది విడుదలయ్యాక కృతి క్రేజ్ పీక్స్‌కు వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే 'శ్యామ్ సింగ రాయ్' మూవీలో నాని సరసన సాయిపల్లవితో పాటు మరో నాయికగా నటిస్తోన్న కృతి, సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తోన్న మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ పోషిస్తోంది. వీటితో పాటు లేటెస్ట్గా మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమె బుక్ అయ్యిందనే వార్త వినిపిస్తోంది. వాటిలో ఒకటి - సురేందర్‌రెడ్డి డైరెక్షన్లో అఖిల్ హీరోగా నటించే సినిమా, ఇంకొకటి - హరి దర్శకత్వంలో సూర్య నటించే మూవీ. ఇలా కృతి శెట్టి వరుస ఆఫర్లతో జోరు చూపిస్తుండటం చూసి, మిగతా తారలు కుళ్లుకుంటున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి 12న 'ఉప్పెన' విడుదలయ్యాక కృతి క్రేజ్ ఇంకెంతగా పెరుగుతుందో, కుర్రకారు గుండెల్లో ఎంతగా చోటు సంపాదిస్తుందో చూడాలి.
![]() |
![]() |