![]() |
![]() |

సినిమా పిచ్చి పీక్స్‌కు చేరుకోవడం అంటే ఇదే.. 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజ్ డేట్‌ను జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని యశ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ లెటర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో, దాని సీక్వెల్ 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆడియెన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' ముందు వరుసలో ఉందనేది కాదనలేని నిజం. కొద్ది రోజుల క్రితం ఈ మూవీని జూలై 16న విడుదల చేయనున్నట్లు నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రకటించారు. అప్పట్నుంచీ యశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా వారు ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా జూలై 16ని నేషనల్ హాలిడేగా ప్రకటించమని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ఆ లెటర్‌లో వారు, "యశ్ నటిస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 16/7/2021 శుక్రవారం విడుదలవుతోందని మనందరికీ తెలుసు. జనం ఆ మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఆ రోజును నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకోవడానికి యత్నించండి. ఇది కేవలం ఓ మూవీ కాదు, మా ఎమోషన్." అంటూ రాసుకొచ్చారు.
విలన్ అధీర రోల్‌ను సంజయ్ దత్ పోషిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారులు.
![]() |
![]() |