![]() |
![]() |

కాలచక్రం మరో సంవత్సరానికి ఆహ్వానం పలికింది. ఎప్పటిలాగే ఈ ఏడాదిలోనూ పలు అగ్ర కథానాయకుల చిత్రాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. 2021లో అందర్నీ ఆకర్షిస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ వివరాలు..
ఆర్ ఆర్ ఆర్:
తెలుగునాట చాన్నాళ్ళ తరువాత వస్తున్న సిసలైన మల్టిస్టారర్ ఇది. ఈ తరం అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకధీరుడు రాజమౌళి నిర్దేశకుడు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ రూ.450 కోట్ల క్రేజీ ప్రాజెక్ట్ సందడి చేయనుంది.
ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామా.. ఈ ఏడాది వేసవిలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
లూసీఫర్ రీమేక్:
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ మలయాళ రీమేక్ కి మోహన్ రాజా డైరెక్టర్. 2021 సెకండాఫ్ లో ఈ పొలిటికల్ డ్రామా తెరపైకి రానుంది.
బీబీ3 (వర్కింగ్ టైటిల్):
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నటసింహ బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఎటెంప్ట్ ఇది. వేసవిలో ఈ సినిమా వినోదాలు పంచనుంది. త్వరలోనే టైటిల్ పై క్లారిటీ వస్తుంది.
నారప్ప:
తమిళంలో ఘనవిజయం సాధించిన అసురన్ కి రీమేక్ వెర్షన్ ఇది. విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న నారప్ప వేసవి ఆరంభంలో సందడి చేయనుంది.
ఎఫ్ 3:
బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2కి సీక్వెల్ ఇది. విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలోనే అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ వేసవిలో రిలీజ్ కానుంది.
వకీల్ సాబ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ ఇది. బాలీవుడ్ కోర్ట్ డ్రామా పింక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఏప్రిల్ లో విడుదల కానుంది.
అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్:
గోపాల గోపాల తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టిస్టారర్ ఇది. రానా దగ్గుబాటి మరో కథానాయకుడు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ మూవీ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.
రాధే శ్యామ్ - సలార్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రానున్న ఈ రెండు సినిమాలు కూడా నాలుగు నెలల గ్యాప్ లో తెరపైకి రానున్నాయి. పిరియడ్ రొమాంటిక్ సాగా రాధేశ్యామ్ వేసవిలో విడుదల కానుండగా.. యాక్షన్ సాగా సలార్ దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.
సర్కారు వారి పాట:
హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా ఇది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తరువాత పరశురామ్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ కథానాయిక. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదల కానుంది.
పుష్ప:
అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా ఇది. రంగస్థలం వంటి సెన్సేషనల్ మూవీ తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రాబోతోంది.
వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ క్రాక్, ఖిలాడి చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే సందడి చేయనున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ఆకాంక్షిద్దాం.
![]() |
![]() |