![]() |
![]() |

కాంట్రవర్సీ కింగ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన 'దిశ ఎన్‌కౌంటర్' పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు 2019 నవంబర్‌లో దేశాన్ని కుదిపేసిన హృదయవిదారకమైన హైదరాబాద్ వెటర్నీర్ డాక్టర్ గ్యాంగ్‌రేప్, మర్డర్ ఉదంతం ఆధారం. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆదివారం మధ్యాహ్నం దిశ కుటుంబం జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించింది.
మీడియాతో దిశ తండ్రి మాట్లాడుతూ, "ఆయన (ఆర్జీవీ) ఈ సినిమా విషయంలో మమ్మల్ని సంప్రదించలేదు. ఆమెకు జరిగిన దానిపై సినిమా తీస్తూ మా పర్మిషన్ తీసుకోలేదు. మా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆయన ఇలాంటి సినిమా ఎలా తీస్తారు? ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆయన యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి మా కుటుంబం అనుభవస్తున్న బాధకు ఎవరు బాధ్యత వహిస్తారు? మా అమ్మాయిపై దారుణం జరిగి ఇంకా ఏడాది కూడా కాలేదు, ఆ బాధ నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఈయన మేం పడుతున్న బాధల నుంచి డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు" అని విమర్శించారు.
కాగా, ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ దిశ ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సెన్సార్ బోర్డ్‌ను సినిమాకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆ కుటుంబం కోర్టును అర్థించింది. ఆ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ అభ్యర్థన వచ్చినట్లయితే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.
![]() |
![]() |