![]() |
![]() |

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి సీనియర్ నటి, శాస్త్రీయ నృత్యకారిణి శోభన తన హృదయపూర్వక సంతాపం తెలిపారు. బాలు అకాల మరణం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులకు, సెలబ్రిటీలకు పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో సెప్టెంబర్ 25న గానగంధర్వుడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.
వారం తర్వాత, బాలు పాడిన 'దళపతి' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'సుందరీ కణ్ణల్ ఒరు సీతీ' క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసుకోవడం ద్వారా ఆయనను గుర్తు చేసుకున్నారు శోభన. ఆ పాటను రజనీకాంత్, శోభనపై చిత్రీకరించారు డైరెక్టర్ మణిరత్నం. అనేక మంది లాగే, తాను కూడా ఆయన మృతి చెందిన బాధ నుంచి తేరుకోలేకపోతున్నానని ఆమె చెప్పారు.
"ఆయన లేని లోటు నుంచి బయటపడటం చాలా కష్టం.. ప్రత్యేకించి ఆయన స్మృత్యర్థం పోస్ట్ చేయడానికి ఓ పాట కోసం వెతుకుతున్నప్పుడు.. మనం ఒక పూడ్చుకోలేని నిధిని కోల్పోయామని చెప్పడం తప్ప ఇంకేం చెప్పగలను. మేమిద్దరం కలిసి నటించాం కూడా. ఆయన పోలీస్ అయితే, నేను దొంగ. ఎస్పీబీ సార్ ఊహాతీతమైన, సరదా అయిన, స్వచ్ఛమైన, పాటే కేంద్రంగా బతికిన వ్యక్తి" అని ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు శోభన.

కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక ఆగస్ట్ 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరారు బాలు. అదే నెల 13వ తేదీ ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటిలేటర్‌పై ఉంచి, ఎక్మో సపోర్ట్ కూడా అందించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్రమేణా మెరుగుపడుతూ వచ్చింది. ఇక మన మధ్యకు రావడమే తరువాయి అనుకొనేంతలో అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించి సెప్టెంబర్ 25న కన్నుమూశారు.
![]() |
![]() |