![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయమైన 'శివ' తెలుగు సినిమా గతిని మార్చేసిన విషయం తెలిసిందే. టెక్నికల్‌గా, స్క్రీన్‌ప్లే పరంగా ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆ మూవీలో భవానీ క్యారెక్టరైజేషన్ కూడా ట్రెండ్ సెట్టరే. క్రూరుడైన విలన్ భవానీగా రఘువరన్ అద్వితీయ నటన ప్రదర్శించి, సినిమా బ్లాక్‌బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ రోజుల్లో రఘువరన్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో తెలిసిందే.
ఈ తరంలో విలక్షణ పాత్రల్లో ఉన్నత స్థాయిలో రాణిస్తున్న ప్రతిభావంతుడైన నటునిగా విజయ్ సేతుపతి పేరు తెచ్చుకున్నాడు. 'విక్రమ్ వేదా'లో గ్యాంగ్‌స్టర్‌గా, '96'లో చిన్ననాటి నేస్తాన్ని ప్రేమించి, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ప్రేమికుడిగా, 'పేట'లో విలన్‌గా, 'సూపర్ డీలక్స్'లో ట్రాన్స్‌జెండర్‌గా.. ఎలాంటి నటనను ప్రదర్శించాడు! అలాంటి విజయ్ సేతుపతి సైతం భవానీ క్యారెక్టర్‌ను పోషించాడు.
అవునా! అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇప్పుడు అతను పోషించిన భవానీ పాత్రకు, శివలో రఘువరన్ పోషించిన పోషించిన భవానీ పాత్రకూ సంబంధం లేదు. పోలిక ఏదైనా ఉందంటే.. అది విలన్! విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన 'మాస్టర్'లో విజయ్ సేతుపతి క్రూరుడైన గ్యాంగ్‌స్టర్ రోల్ పోషించాడు. ఆ పాత్ర పేరు భవానీ. సినిమాలో అతడే మెయిన్ విలన్. విజయ్‌ను అతను ఢీకొనే తీరును డైరెక్టర్ సూపర్బ్‌గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఈ భవానీ క్యారెక్టర్‌తో విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
![]() |
![]() |