![]() |
![]() |

కరీనా కపూర్ ఎప్పుడూ ఒక ట్రెండ్ సెట్టరే. కెరీర్ శిఖరాగ్ర స్థాయిలో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకుంది. తొలిసారి గర్భం దాల్చినప్పుడు ఆ కడుపుతోటే ర్యాంప్‌పై సంతోషంగా వాక్ చేసింది. తర్వాత కొడుకు తైమూర్‌ను కన్నది. గత ఆగస్ట్ 12న రెండోసారి గర్భం దాల్చినట్లు భర్తతో కలసి ప్రకటించింది కరీనా. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచిందామె.
ఆమె కథానాయికగా నటిస్తోన్న 'లాల్ సింగ్ చడ్ఢా' సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలల పాటు ఆగిపోయింది. ఇటీవల షూటింగ్ పునఃప్రారంభించిన ఆమిర్ ఖాన్ టర్కీ వెళ్లి కొన్ని రోజుల పాటు అక్కడ షూటింగ్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఢిల్లీలో చిత్రీకరణ జరుపుతున్నాడు. ఈ సినిమాలో ఆమిర్ జోడీగా కరీనా నటిస్తోంది. ఆశ్చర్యపరిచే విషయమేమంటే కరీనా గర్భవతిగానే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఉండటం!

కడుపు ఎత్తుగా కనిపిస్తుంది కదా.. దాన్నెలా మేనేజ్ చేస్తారనే సందేహం వస్తుంది.. అవును. దాన్ని వీఎఫ్ఎక్స్ సాయంతో తెరపై కనిపించకుండా చేస్తారంట. ఆమె ఈ సినిమా కోసం మూడు నెలల పాటు డేట్స్ ఇచ్చింది. అక్టోబర్ నాటికి ఆమె సన్నివేశాలన్నింటినీ చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్, కరీనాపై సీన్లు తీస్తున్నారు. ఆ సెట్సఫై ఉన్న కరీనా ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో కరీనా గార్జియస్‌గా కనిపిస్తోంది.
అందానికి అందం, నటనకు నటన పుష్కలంగా ఉన్న కరీనా చాలా మంది ఫేవరేట్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఆమె పేరు మీద వందల కొద్దీ ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. వాటిలో ఇంతవరకూ బయటకు వెల్లడి కాకుండా ఉన్న విషయాలను కూడా పంచుకుంటున్నారు. అలాగే తాజాగా 'లాల్ సింగ్ చడ్ఢా' సెట్స్‌పై కరీనా తిరుగుతున్న ఫొటోలు కూడా ఈ ఫ్యాన్ పేజీల్లో ప్రత్యక్షమయ్యాయి. ముఖంలో వర్చస్సు, ఉబ్బెత్తుగా ఉన్న పొట్టతో ఆమెలో వింత అందం ప్రకాశిస్తోంది.

![]() |
![]() |