![]() |
![]() |

కంగనా రనౌత్‌తో బీఏంసీ వివాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందనే సూచనలు కనిపిస్తున్నాయి. కంగన, శివసేన వివాదంలో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఏడాదికి పైగా ఎదురుచూసిన అవకాశం ఇప్పుడు వచ్చిందని ఆ పార్టీ ఆనందపడుతోంది. కంగనకు కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించడంపైనా ఓ వ్యూహం ఉందంటున్నారు. లేటెస్ట్‌గా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కూడా రంగంలోకి దించింది. కంగన ఆఫీస్ బిల్డింగ్‌ను బీఎంసీ కూల్చివేసిన తీరును ఆయన తప్పు పట్టడమే కాకుండా సీఎం సలహాదారులను పిలిపించి మాట్లాడారు. అంతేకాదు, కేంద్రానికి ఓ రిపోర్ట్ పంపాలని ఆయన నిర్ణయించడం కూడా ఆ వ్యూహంలో భాగమంటున్నారు.
నిజానికి రెండేళ్ల క్రితమే నిబంధనలకు విరుద్ధంగా కంగన తన ఆఫీస్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారంటూ బీఎంసీ నోటీసు ఇచ్చిందంటున్నారు. 2018 మార్చి 28న ఇచ్చిన నోటీస్‌పై కంగన కోర్టును ఆశ్రయించినట్లు బీఎంసీ అధికారులు అంటున్నారు. అయితే దీన్ని కంగన ఖండించారు. ఈ నెల 8న ఇచ్చిన నోటీసు తప్ప గతంలో తనకు ఎలాంటి నోటీసులూ బీఎంసీ ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆమె పోస్ట్ చేశారు. కంగన ఆఫీస్ బిల్డింగ్ అక్రమ కట్టడం కాదంటూ ఆమె లాయర్ రిజ్వాన్ సిద్దిఖి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూల్చివేత ఆపాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అవి అందేలోగా తను అక్రమ కట్టడంగా చెప్పిన భాగంలో దాదాపు 75 శాతాన్ని బీఎంసీ కూల్చివేసింది. ఆ తర్వాతే కూల్చివేత పనులు ఆపారు.
తన ఆఫీస్ కూల్చివేతలో ఆర్థిక నష్టం చిన్న విషయమేననీ, ఇలాంటి చర్యలు తనలో ఆత్మ స్థైర్యాన్ని మరింత పెంచుతాయనీ ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన కంగన చెప్పారు. కంగన వ్యాఖ్యలకు అనవసర ప్రచారం ఇస్తున్నారని ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఆమె ఆఫీస్‌ను కూలగొట్టిన టైమింగ్ వల్ల అనసవర రాద్ధాంతానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యిందనీ ఆయన చెప్పడంతో బీజేపీకి మంచి అస్త్రం దొరికినట్లయింది. అందుకే గవర్నర్‌ను రంగంలోకి దించిందంటున్నారు. రానున్న కొద్ది రోజుల్లో కంగన, శివసేన వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
![]() |
![]() |