![]() |
![]() |

ఇటీవల కోలీవుడ్ స్టార్స్ విజయ్, సూర్య, జ్యోతిక వంటి వాళ్లపై తన సోషల్ మీడియా అకౌంట్‌లో అవమానకర ప్రకటనలను పోస్ట్ చెయ్యడం ద్వారా వార్తల్లోకి ఎక్కింది తనను తాను సూపర్‌మోడల్‌గా అభివర్ణించుకొనే మీరా మిథున్. ప్రస్తుత ట్రెండ్‌లను బట్టి లక్ష్యాలను ఎంచుకుంటూ వస్తున్న మీరా.. నెపోటిజం, ఫిల్మ్ మాఫియా, మహిళా సాధికారత వంటి లేటెస్ట్ హాట్ టాపిక్స్‌పై నెటిజన్లు తన టైమ్‌లైన్‌లో పోస్ట్ చేసే నెగటివ్ కామెంట్స్‌ను హైలైట్ చేస్తూ వస్తోంది.
ఇప్పుడు తాజాగా ఆమె తన అస్త్రాలను కమల్ హాసన్‌పై ఎక్కుపెట్టింది. తనకు సంబంధించిన ఒక గ్లామర్ వీడియోను పాపులర్ ప్రొడక్షన్ కంపెనీ ట్రెండ్ అలౌడ్ దాచి పెట్టిందనీ, దాని వెనుక ఉన్న వ్యక్తి కమల్ హాసన్ అనీ ఒక వీడియో ద్వారా ఆరోపించింది మీరా. ఈ అంశంలోకి ఆమె కమల్‌ని లాగడం వెనుక ఓ కారణం ఉంది. ఓ సినిమాలో తను నటించాల్సిన పాత్రను కమల్ కూతురు అక్షర కొట్టేసిందని గతంలోనే మీరా ఆరోపించింది. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కంపెనీలో అక్షర ఓ సినిమా చేస్తుండటం మీరా ఆరోపణలకు కారణమని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.
తన గ్లామర్ వీడియోను కనుక తనకివ్వకపోతే కమల్ హాసన్‌పై కేసు పెడతాననీ, బిగ్ బాస్ 4 హోస్ట్‌గా పనిచెయ్యకుండా అతడిని బ్యాన్ చెయ్యాలని పోరాటం చేస్తాననీ హెచ్చరించింది మీరా. ఆ షోకు హోస్ట్‌గా కమల్ పనికిరారనీ, బిగ్ బాస్ 3లో డైరెక్టర్ చేరన్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, కమల్ ఆయననే సమర్థించాడనీ ఆమె ఆరోపించింది. అయితే మీరా మిథున్ ఆరోపణలకు కమల్ హాసన్ కానీ, బిగ్ బాస్ 4 తమిళం నిర్వాహకులు కానీ స్పందించలేదు.
![]() |
![]() |