![]() |
![]() |

క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు పొందిన కృష్ణవంశీకి ఓ హిట్ వచ్చి ఎంత కాలమైంది? పదమూడేళ్లు. 2007లో వచ్చిన 'చందమామ' సినిమా తర్వాత ఆయన విజయపు రుచిని చూడలేదు. ఈ మధ్యలో శశిరేఖా పరిణయం, మహాత్మా, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం సినిమాలను ఆయన తీశారు. వీటిలో రామ్‌చరణ్‌తో చేసిన గోవిందుడు అందరివాడేలే' సినిమా గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ, "మాస్, యాక్షన్ లవ్ స్టోరీలు ఎక్కువగా వస్తున్న తరుణంలో దర్శకుడిగా నాకు హిట్టులేని సమయంలో చరణ్ లాంటి స్టార్ హీరో ఈ కథను అంగీకరించి, నాకు అవకాశమివ్వడం గొప్ప విషయం" అన్నారు.
ఇక సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ అయితే కృష్ణవంశీని ఆకాశానికెత్తేశారు. "బాపుగారు చనిపోయాక ఆయనలా తెలుగు ముంగిళ్లలో ముగ్గులు ఎవరేస్తారు అని చాలామంది అనుకున్నారు. నేనున్నాను అంటూ కృష్ణవంశీ చక్కని తెలుగు సినిమా తీశారు" అని ఆయన అన్నారు. కానీ ఆ సినిమా గొప్పతనం ఆ మూవీ విడుదలైన వారం రోజుల వరకే ఉంది. ఆ తర్వాత దాని గురించి జనం మర్చిపోతూ వచ్చారు. బాక్సాఫీస్ దగ్గర కూడా అదేమంత ఆశాజనక ఫలితాల్ని ఇవ్వలేదు. దాని నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఎప్పుడూ ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకోలేదు.
ఆ సినిమా తర్వాత సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్‌తో కృష్ణవంశీ రూపొందించిన 'నక్షత్రం' సినిమా డిజాస్టర్ అయ్యింది. అది వచ్చిన మూడేళ్ల తర్వాత ఆయన 'రంగమార్తండ' సినిమాని తీస్తున్నారు. నానా పటేకర్ నటించగా మరాఠీలో విడుదలై నేషనల్ అవార్డ్స్ పొందడమే కాకుండా, ప్రేక్షకాదరణను కూడా అమితంగా పొందిన 'నటసామ్రాట్' సినిమాని తెలుగులో ప్రకాశ్‌రాజ్‌తో తీస్తున్నాడు కృష్ణవంశీ. ఇదే సినిమాతో రాహుల్ సిప్లిగంజ్ యాక్టర్‌గా మన ముందుకు రాబోతున్నాడు. నాటకాల్లో నటించే ఓ నటుడి కథగా ఈ సినిమా కనిపిస్తుంది. గత ఏడాది షూటింగ్ మొదలైన ఈ సినిమా ప్రస్తుత కరోనా సంక్షోభంలో చిక్కుకుని, ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తోంది. 'రంగమార్తాండ' మూవీతోనైనా కృష్ణవంశీ పూర్వ వైభవాన్ని గుర్తుకుతెస్తారా? చూద్దాం...
![]() |
![]() |