![]() |
![]() |

నటుడు సోనూసూద్ మరోసారి తన దయార్ద్ర హృదయాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతు నాగేశ్వరరావు, ఆయన భార్య, కూతుళ్లు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు. నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను కొని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను అందించారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబసభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోనూసూద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా సోనూకు రైతు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా నాగేశ్వరరావు చిత్తూరు జిల్లా మదనపల్లెలో టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో సహా తన స్వంత గ్రామానికి వెళ్లాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడి పట్టుకు నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే... వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో సోనూసూద్ కంటపడింది. ఇంకేముంది.. ఆయన చలించిపోయారు. వారి కష్టాన్ని చూడలేక పోయారు. ‘‘ఈ ఫ్యామిలీకి ఉంది ఒక జత ఎద్దులు పొందే అర్హత కాదు. ఒక ట్రాక్టర్ పొందే అర్హత. కాబట్టి మీకో ట్రాక్టర్ పంపుతాను. సాయంత్రానికల్లా మీ పొలాలను ఆ ట్రాక్టర్ దున్నుతుంది" అని ట్వీట్ చేశారు.

ఇప్పటికే దేశంలో లాక్‌డౌన్ ముగిశాక దేశవ్యాప్తంగా ఉన్న వేలాది వలస కార్మికులను వాళ్ల సొంత ఊళ్లకు తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి పంపుతూ వచ్చి తన గొప్ప మనసును చాటుకున్న సోనూ సూద్.. ఇప్పుడు ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిన ఉదంతం.. తెరపైనే ఆయన విలన్ అనీ, నిజ జీవితంలో ఆయన అసలు సిసలు హీరో అనీ చాటి చెప్పింది.

![]() |
![]() |