![]() |
![]() |

వివాదాస్పద ట్వీట్ల, సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్‌గా 'పవర్ స్టార్' అనే సినిమాని తీయబోతున్నానంటూ ప్రకటించడం, పవన్ కల్యాణ్ అభిమానుల్ని ఆగ్రహోదగ్రుల్ని చేసింది. పైగా ఆ సినిమాలో ఏమేం క్యారెక్టర్లు ఉంటాయో చెప్పిన వాటిల్లో 8 బర్రెలు కూడా ఉంటాయనడం వాళ్ల మనసుల్ని మరింత గాయపరిచింది. పీకే ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్‌లోని అనేకమంది ఆర్జీవీ ప్రకటనపై గుస్సా అవుతున్నారని తెలుస్తోంది. అయితే వారంతా తమ ఆగ్రహాన్ని, ఆవేదనను మనసులోనే దాచుకుంటున్నారు. కానీ పేరుపొందిన గేయ రచయిత ఒకరు మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేకపోయారు. ఆయనే.. రామజోగయ్య శాస్త్రి!
ఆర్జీవీ 'పవర్ స్టార్' మూవీ ట్వీట్ చూశాక రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగానే స్పందించారు. "ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం... మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు.. పోండి సార్ మీతో కటీఫ్.... మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు.. తెలివిగా ఏదో చెప్పేస్తారు... నేను హర్ట్ :(" అని ఆయన ట్వీట్ చేశారు. శాస్త్రి ట్వీట్‌కు పీకే ఫ్యాన్స్ మద్దతు పలకగా, ఆర్జీవీ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు.
ఏదేమైనా ఆర్జీవీని మణిరత్నంతో పోలుస్తూనే, సున్నితంగా మీతో కటీఫ్ అని ట్వీట్ చేసిన శాస్త్రి, తాను హర్టయ్యానని చెప్పడం చూస్తే.. ఆయన పీకే అభిమాని అని అర్థమవుతోంది. ఇండస్ట్రీలోని పీకే అభిమానుల హృదయాల్ని ఆర్జీవీ ఎంతగా గాయపరిచాడో రామజోగయ్య శాస్త్రి స్పందన తెలియజేస్తోంది.
![]() |
![]() |