![]() |
![]() |

ఎవరైనా బ్రేక్ తీసుకుంటారేమో కానీ, ఆర్జీవీ మాత్రం నిత్యం బ్రేకింగ్ న్యూస్‌తో బిజీగా ఉంటారు. ఇప్పుడూ అంతే. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'నేక్డ్' ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో హల్‌చల్ చేస్తుండగా, 'పవర్ స్టార్' పేరుతో సినిమా తీయబోతున్నానంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో బ్రేకింగ్ న్యూస్ వదిలారు వర్మ. ఆ సినిమాలో పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యన్ వనిత, నలుగురు పిల్లలు, 8 గేదెలు, ఆర్జీవీ నటిస్తారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ క్యారెక్టర్లు ఎవరో అర్థం చేసుకున్నందుకు కానుకలేమీ ఇవ్వమని అని సెటైర్ కూడా వేశారు.
ఆయన పేర్కొన్న పొడి అక్షరాలతో ఇచ్చిన క్లూలను ఒకసారి చూస్తే.. పీకే అంటే పవన్ కల్యాణ్, ఎంఎస్ అంటే మెగా స్టార్, ఎన్‌బీ అంటే నాగబాబు, టీఎస్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఒక రష్యన్ వనిత అంటే పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా, నలుగురు పిల్లలు అంటే పవన్ కల్యాణ్ నలుగురు పిల్లలు (ఇద్దరు రేణు దేశాయ్ ద్వారా, ఇద్దరు అన్నా లెజ్‌నోవా ద్వారా) అని అర్థం అవుతుంది. మరి ఎనిమిది గేదెలు అంటే.. పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్‌లో ఉన్న గేదెలని అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు తన పాత్ర కూడా ఉంటుందని ఆర్జీవీ తెలిపారు.
ఆ వెంటనే తన 'పవర్ స్టార్' సినిమాలో టైటిల్ రోల్ చేసే స్టార్ ఇతనే అంటూ ఒక యువకుడిని పరిచయం చేశారు. 'అత్తారింటికి దారేది' మూవీలో పవన్ కల్యాణ్ కనిపించే రెడ్ టీ షర్ట్, బ్రౌన్ ప్యాంట్ డ్రస్‌లో అతను పీకే తరహాలోనే కనిపిస్తున్నాడు. తన ఆఫీస్‌కు అతను వచ్చినప్పుడు తీసిన వీడియో అంటూ ఆ యువకుడు తన ఆఫీస్ కాంపౌండ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో క్లిప్‌ను షేర్ చేశారు వర్మ. అతనిలో ఎవరి పోలికలైనా కనిపిస్తుంటే, అది యాదృచ్ఛికమేనని ఆర్జీవీ అంటున్నారు.
ఇప్పటికే పరిటాల రవి కథతో 'రక్తచరిత్ర', ఎన్టీఆర్ కథతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలను తీసి వార్తల్లో నిలిచిన ఆర్జీవీ లేటెస్ట్‌గా మారుతిరావు రాసిన అమృత ప్రణయగాథ అనే ట్యాగ్‌లైన్‌తో 'మర్డర్' సినిమాని నిర్మిస్తున్నారు. ఆ మూవీ స్టిల్స్‌తో వివాదాన్ని రేకెత్తించిన ఆయన ఇప్పుడు పవన్ కల్యాణ్ కథతో 'పవర్ స్టార్' సినిమాని ఎనౌన్స్ చేయడం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. పీకే ఫ్యాన్స్ మాత్రం ఆర్జీవీ అనౌన్స్‌మెంట్‌తో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

![]() |
![]() |