![]() |
![]() |

ఇండస్ట్రీ అంతా గురువుగా భావించే దాసరి నారాయణరావు మృతి చెంది మూడేళ్లు గడిచాయి. అప్పట్నుంచీ ఆయన ఇద్దరు కుమారులు హరిహర ప్రభు, అరుణ్‌కుమార్ మధ్య ఆస్తి గొడవలు నడుస్తున్నాయి. తను చనిపోతే, మధ్యవర్తులుగా ఉండి మురళీమోహన్, మోహన్‌బాబు తన పిల్లలకు ఆస్తి పంపకం విషయంలో ఎలాంటి గొడవలు లేకుండా చూడాలని దాసరి తన వీలునామాలో రాశారు. అయితే ఆయన ఆకాంక్షను పూర్తి స్థాయిలో తాము నెరవేర్చలేకపోయామని మోహన్‌బాబు ఆ మధ్య ఒక కార్యక్రమంలో కాస్త ఆవేదన వ్యక్తం చేశారు.
కట్ చేస్తే.. దాసరి పెద్ద కుమారుడు ప్రభు శుక్రవారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమ మధ్య ఉన్న ఆస్తుల గొడవను మరింత బహిర్గతం చేశారు. తన తమ్ముడు అరుణ్‌కుమార్ తమ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశంచి, తనను, తన భార్యను, అత్తామామలను దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ తండ్రి రాసిన వీలునామా ప్రకారమే తమ తండ్రి ఇంట్లో తాము ఉంటున్నామనీ, ఆ ఇంటిని తన కూతురి (దాసరి మనవరాలి) పేరిట ఆయన రాశారనీ ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే జూన్ 24వ తేదీ రాత్రి వేళ అరుణ్ తమ ఇంటి గేటుదూరి లోపలికి వచ్చి దారుణంగా ప్రవర్తించాడనీ, ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడనీ ప్రభు ఆరోపించారు. మోహన్‌బాబు, మురళీమోహన్, సి. కల్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలనీ, కానీ వారు మౌనంగా ఉంటున్నారనీ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా ఈ వ్యవహారంపై దాసరి అరుణ్‌కుమార్ నోరు విప్పనున్నారు. కొద్దిసేపట్లో ప్రెస్‌మీట్ పెట్టి, తమ అన్నదమ్ముల మధ్య ఏర్పడిన ఆస్తుల గొడవ గురించీ, ప్రభు పెట్టిన పోలీస్ కేసు గురించీ మాట్లాడనున్నారు. ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరం.
![]() |
![]() |