![]() |
![]() |

కలిసొచ్చిన కథానాయికలతో మరోసారి జట్టుకట్టడం ఏ చిత్ర పరిశ్రమలోనైనా సర్వసాధారణం. ఇందుకు యువ కథానాయకుడు నితిన్ కూడా మినహాయింపు కాదు. కెరీర్ ఆరంభం నుండి తనకు అచ్చొచ్చిన కథానాయికలతో మరోసారి సందడి చేశాడీ ‘దిల్’ స్టార్. తన మొదటి సినిమా ‘జయం’ (2002)లో హీరోయిన్‌గా నటించిన సదాతో మరోసారి ‘టక్కరి’ (2007) కోసం జోడీ కట్టాడు నితిన్. అలాగే.. ‘సై’ (2004) నాయిక జెనీలియాతో ‘రామ్’ (2006) కోసం వన్స్ మోర్ అంటూ చిందులేశాడు. అదే విధంగా తన కెరీర్‌లో బౌన్స్ బ్యాక్ ఫిలిమ్‌గా నిలిచిన ‘ఇష్క్’ (2012)లో నాయికగా నటించిన నిత్యా మీనన్‌తో వెనువెంటనే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (2013) అంటూ ఆడిపాడాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అచ్చొచ్చిన అందగత్తెలతోనే 'వన్స్ మోర్ పెయిర్' ట్రెండ్‌ని కొనసాగించాడు నితిన్.
అయితే, ఈ మధ్య నితిన్ సరళి కాస్త మారింది. ఓ సినిమా చేస్తుండగానే రిజల్ట్‌తో సంబంధం లేకుండా మరో సినిమాలో నాయికగా అవకాశం ఇచ్చేస్తున్నాడు. అలా.. ‘లై’ (2017)లో హీరోయిన్‌గా నటించిన మేఘా ఆకాశ్‌కి ఆ సినిమా రిలీజ్ కాకముందే ‘ఛల్ మోహన్ రంగ’ (2018)లో ఆఫర్ ఇచ్చాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత మేఘలాగే మరో నాయికతోనూ ఓ సినిమా రిలీజ్ కాకుండానే.. మరో సినిమాలో నటించే వైనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ నాయిక మరెవరో కాదు.. ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘రంగ్ దే’ విడుదల కాకముందే.. త్వరలో పట్టాలెక్కనున్న ‘పవర్ పేట్’ కోసం మరోమారు జట్టుకట్టనున్నారట నితిన్, కీర్తి. కాకపోతే.. ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’ తరహాలో నితిన్‌కి ఇవి బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ అయితే కావు. మధ్యలో ‘చెక్’ (ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నాయికలు), ‘అంధాదున్’ రీమేక్ రాబోతున్నాయి.
మరి.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా మేఘకి ‘లై’ విడుదల కాకముందే ‘ఛల్ మోహన్ రంగ’ రూపంలో ఛాన్స్ ఇచ్చి భంగపడ్డ నితిన్‌కి.. ‘రంగ్ దే’ విడుదలకు ముందే ‘పవర్ పేట్’లో కీర్తితో జట్టుకడుతున్న వైనం ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. నితిన్‌తో మేఘ రెండోసారి జట్టుకట్టిన చిత్రమైన ‘ఛల్ మోహన్ రంగ’కి దర్శకత్వం వహించిన కృష్ణచైతన్యనే.. కీర్తి సురేశ్‌తో నితిన్ సెకండ్ టైమ్ జంటగా నటిస్తున్న ‘పవర్ పేట్’ని కూడా డైరెక్ట్ చేస్తుండడం. త్వరలోనే ‘పవర్ పేట్’లో కీర్తి సురేశ్ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
![]() |
![]() |