![]() |
![]() |

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ బాషా సినిమా ద్వారా టాలీవుడ్‌కు ప్రదానం చేసిన వరం ఫ్లాష్‌బ్యాక్! దాంతో మన దర్శకులకు సినిమా మాధ్యమం మీద అమోఘమైన పట్టు చిక్కినట్టనిపించి - "తీస్కో పాత మూస, యేస్కో ఫ్లాష్‌బ్యాకు, రాస్తే మజా, తీసేస్తే నిషా, కలిపికొట్టు మొనగాడా" అని బాగా విర్రవీగడానికి వీలైంది. ఒక్క 'బాషా' వల్ల ఎన్ని వందల ఫ్లాష్‌బ్యాక్‌ల సినిమాలొచ్చి పడ్డాయో లెక్కలేదు! ఒక లవ్ స్టోరీనో, ఇంకేదో ట్రెండ్ సెట్టరైతే, అవే థీమ్స్‌తో అలాంటి మరికొన్ని సినిమాలు రావడం కద్దు. కానీ ఒక హిట్టయిన ఫార్మాట్‌తో అదే మూసలో సినిమాల వెల్లువ కనీవినీ ఎరుగనిది. 'బాషా' ఫార్మట్‌తో ఇది ఫ్యాక్షన్ సినిమాల రూపంలో జరిగింది. థీమ్ వేరు, ఫార్మాట్ వేరు. ఒకే థీమ్‌తో క్రియేటివ్‌గా ఎన్ని తరహా సినిమాలైనా రావచ్చు. ఒకే ఫార్మాట్‌తో ఈ వైవిధ్యం సాధ్యం కాదు. అందుకే 'బాషా' ప్రేరేపిత ఫార్మాట్ సినిమాల కథనాలన్నీ ఒకే మూసలో ఉంటాయి. మూస కథనం సస్పెన్స్‌కు దూరం.
పక్కా మాస్ మసాలా యాక్షన్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఈ ఫ్లాష్‌బ్యాక్ మసాలా ఫార్మాట్ బాగా వంటపట్టేసింది. అందుకే ఆయన హిట్టయిన లేదా ఫట్టయిన సినిమాలన్నింటిలోనూ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటుంది. తొలి సినిమా 'భద్ర' నుంచే బోయపాటి ఈ ఫ్లాష్‌బ్యాక్‌ను బాగా నమ్ముకున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ సినిమాలో హీరోయిన్ మీరా జాస్మిన్ కుటుంబానికి చెందిన ఫ్లాష్‌బ్యాక్ సినిమాకు టర్నింగ్ పాయింట్. విలన్ల కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆమెకు హీరో భద్ర (రవితేజ) ఎలా రక్షకుడిగా నిలిచి, ఆమె హృదయాన్ని గెలిచాడనే విషయం ఇందులోని ప్రధానాంశం. వెంకటేశ్‌తో తీసిన తన రెండో సినిమా 'తులసి'లో భార్యాభర్తలైన వెంకటేశ్, నయనతార ఎందుకు విడిపోయారనే కీలకాంశాన్ని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో దాచి, రివీల్ చేశాడు బోయపాటి. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడాయి. ఇక మూడో సినిమా అయితే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి బోయపాటిని అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేర్చింది. ఆ సినిమా.. బాలకృష్ణ టైటిల్ రోల్ చేసిన 'సింహా'. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేశాడు. అందులో తండ్రి పాత్రకు సంబంధించిన కథ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లోనే వస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్‌తో బోయపాటి తీసిన 'దమ్ము'లోనూ సూర్యవంశం, చంద్రవంశం కుటుంబాలకు చెందిన ఫ్లాష్‌బ్యాక్ కనిపిస్తుంది. అయితే కథ పూర్తిగా నేలవిడిచిన సాము చందంగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా పల్టీ కొట్టింది. అయినా కానీ.. ఫ్లాష్‌బ్యాక్‌ను నమ్ముకోవడం మానలేదు బోయపాటి. ఈసారి మరింత రసవత్తరంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను రంగరించి 'లెజెండ్' మూవీని తీశాడు. అందులోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. టైటిల్ రోల్‌కు సంబంధించిన కథను ఎక్కువగా ఫ్లాష్‌బ్యాక్‌లోనే చూపించి, ఫలితం రాబట్టాడు దర్శకుడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో తీసిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ 'సరైనోడు'లోనూ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు సంబంధించిన కీలక ఎపిసోడ్‌ను ఫ్లాష్‌బ్యాక్ నెరేషన్‌తోనూ ప్రెజెంట్ చేశాడు బోయపాటి. ఆ తర్వాత చేసిన 'జయ జానకి నాయక' చిత్రంలో సరైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎందుకనో కుదరలేదు. ఇక రామ్‌చరణ్‌తో తీసిన మునుపటి ఫ్లాప్ ఫిల్మ్ 'వినయ విధేయ రామ'లోనూ చరణ్ అన్నగా నటించిన ప్రశాంత్ డెత్ ఎపిసోడ్‌ను ఫ్లాఫ్‌బ్యాక్ నెరేషన్‌తో చూపించాడు కానీ, దాన్ని చిత్రీకరించిన తీరు లాజిక్‌లెస్‌గా ఉండటంతో అపహాస్యం పాలైంది.
ఇప్పుడు మూడోసారి బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు బోయపాటి. 'బీబీ3' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలోనూ మునుపటి రెండు సినిమాల తరహాలో బాలయ్యను అతను డ్యూయల్ రోల్‌లో ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఇప్పటికే 'బీబీ3 ఫస్ట్ రోర్' పేరుతో వచ్చిన టీజర్‌లో ఒక బాలయ్యను మనం చూసేశాం. మరో బాలయ్య అఘోరా అవతారంలో కనిపిస్తాడని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ఆ అఘోరా కథను ఫ్లాష్‌బ్యాక్ రూపంలో బోయపాటి చూపించనున్నాడని తెలుస్తోంది. కథకు అత్యంత కీలకమైన ఆ ఎపిసోడ్ మీదే ఈ సినిమా కథ ఆధారపడి ఉంటుందనీ, అందుకే ప్రేక్షకుల ఒళ్లు జలదరించేలా ఆ ఎపిసోడ్‌ను బోయపాటి తీర్చిదిద్దాడనీ సమాచారం. బహుశా ఇప్పటి డైరెక్టర్లలో ఫ్లాష్‌బ్యాక్ ఫార్మట్‌ను అతనిలా వాడుకుంటున్న డైరెక్టర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 'బీబీ3' మూవీలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్యను అతను ఎలా ప్రెజెంట్ చేయనున్నాడనేదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోన్న విషయం.
![]() |
![]() |