![]() |
![]() |

లైమ్‌లైట్‌లో ఉన్న ఒక వ్యక్తి తన జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నప్పుడు అతని మనసులో మెదిలో చివరాఖరి విషయం ఏమై ఉంటుంది? 34 సంవత్సరాల బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించి విన్నప్పుడు చాలా మంది మనసులో ఈ ఆలోచన రేకెత్తే ఉంటుంది. అతని చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ దీనికి రెలవెంట్‌గా ఉందనిపిస్తుంది. ఆ పోస్ట్‌లో తన తల్లి పిక్చర్‌ను షేర్ చేసిన సుశాంత్, "కన్నీటి చుక్కల నుంచి మసకబారుతున్న గతం, అంతులేని కలలు చెక్కుతున్న ఒక చిరునవ్వు, ఒక అస్థిర జీవితం, ఇద్దరి మధ్య సంప్రదింపులు.." అంటూ రాసుకొచ్చాడు. ఆ మాటల్లోని అర్థాన్ని, తాత్వికతను చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని తోటి యాక్టర్లు, టెక్నీషియన్లు అతడితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. అభిమానులు విషణ్ణ వదనాలతో రోదిస్తున్నారు.
అనూహ్యమైనది జరిగినప్పుడు ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. ఇంజనీరింగ్ బదులు నటనను వృత్తిగా ఎంచుకున్న సుశాంత్ సింగ్ ఏడేళ్ల సినీ కెరీర్‌లో కై పో చే, శుద్ధ్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమ్‌కేష్ బక్షి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, కేదార్‌నాథ్, చిచ్చోరే వంటి మంచి సినిమాలున్నాయి. ఇప్పుడిప్పుడే అతను బాలీవుడ్‌లో తనదైన ముద్రను వేస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో, మంచి సినిమాలతో ఆడియెన్స్‌ను అలరిస్తాడనే నమ్మకం కలిగిస్తున్నాడు.
ఆదివారం ఉదయం, ఆర్ట్ డిజైనర్ సిద్ధార్థ్ పితానితో షేర్ చేసుకుంటున్న, బాంద్రా కార్టర్ రోడ్‌లో ఉన్న మౌంట్ బ్లాంక్‌లో తను నివాసం ఉంటున్న ఆరో అంతస్తు ఫ్లాట్‌లో తన ప్రాణాలను తనే తీసుకున్నాడు సుశాంత్. తన బెడ్‌రూమ్‌లో అతను ఉరేసుకొని ఉన్నట్లు అతని ఇంటి సిబ్బందిలో ఒకరు గుర్తించారు. జూన్ 9న, సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలివాన్.. మలద్‌లోని తన నివాసం నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక సమస్యల వల్లే ఆమె ఆ పని చేసిందనే ప్రచారం ఉంది. ఆరు రోజుల తర్వాత సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ రెండు మరణాల వెనుక ఏదైనా సంబంధం ఉందా.. అనే కోణంలో పోలీసులు చేసిన దర్యాప్తులో అందుకు అనుగుణంగా ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

ఆదివారం ఉదయం 6.30 గంటలకు లేచిన అతను ఒక గ్లాస్ దానిమ్మ రసం తాగాడు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌కు వెళ్లాడు. ఒక గంట తర్వాత లంచ్‌లో ఏం చెయ్యమంటారని అడగటానికి అతని దగ్గర పనిచేసే అతను డోర్ కొట్టాడు. సుశాంత్ నుంచి రెస్పాన్స్ రాలేదు. అతను ఆగి ఆగి చాలా సేపు డోర్ కొట్టినా బదులు లేకపోయేసరికి సుశాంత్‌తో పాటు ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధార్థ్ కలిసి సుశాంత్ సోదరికి కబురు చేశారు. ఆమె వచ్చాక, బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే, బెడ్‌షీట్‌తో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న సుశాంత్ కనిపించాడు. వెంటనే అతడిని కూపర్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఫ్లాట్‌లో సూసైడ్ నోట్ లాంటిదేమీ లభించలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.
క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన తొమ్మిదో యూనిట్ సుశాంత్ మొబైల్ ఫోన్ కాల్స్, వాట్సప్ వంటి వాటిని పరిశీలిస్తోంది. ఫ్లాట్‌లోనే నివాసం ఉంటున్న సుశాంత్ స్టాఫ్ మెంబర్స్.. ఇద్దరు వంటవాళ్లు, ఒక హౌస్‌కీపర్‌తో పాటు ఇరుగుపొరుగువాళ్లను, బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆర్నెల్ల క్రితమే ఈ ఫ్లాట్‌కు వచ్చిన సుశాంత్, నెలకు 4.5 లక్షల రూపాయలను అద్దె కింద చెల్లిస్తున్నాడు. ఈ ఫ్లాట్‌లో 2022 వరకు ఉండేలా అతను ఒప్పందం చేసుకున్నాడు.
హ్యాపీగా ఉండటమే తన జీవితంలో ప్రధాన ఉద్దేశమని సుశాంత్ చెప్పేవాడని తోటి నటుడు అమీర్ అలీ తెలిపాడు. "నా కెరీర్ ఎలా సాగాలో అలా సాగుతుంది. ఇక్కడ వర్కవుట్ కాకపోతే, టెలివిజన్‌కు తిరిగెళ్లపోతా" అని సుశాంత్ అనేవాడు. "నేను ఇల్లు కొనుక్కోమని అతని పీడించినప్పుడల్లా నవ్వేసేవాడు. ఇంటికి బదులుగా కార్లు, బైక్‌లు కొనడానికి ఇష్టపడేవాడు. తనకు ఇష్టమైన వాటిని సమకూర్చుకొని, వాటితో ఆనందంగా ఉండేవాడు" అని అలీ చెప్పాడు.
షూటింగ్ లేని సమయంలో తన టెలిస్కోప్‌తో ఆకాశంలోకి చూస్తూ ఆనందించేవాడు సుశాంత్. అతడికి చాలా కోరికలున్నాయి. సుదూర ప్రాంతాలను సందర్శించడం, ఆకాశంలోని ప్రకాశంతమైన అరోరా కాంతుల్ని పెయింట్ చేయడం, పుస్తకం రాయడం, తన అభిమాన హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ (ఐరన్‌మ్యాన్)తో సెల్ఫీ దిగడం వంటివి వాటిలో కొన్ని. అతనెప్పుడూ ఎంతో ఎనర్జీతో, ఉత్సాహంతో కనిపించేవాడు. అలాంటి సుశాంత్ లేడనే వార్త అందర్నీ షాకింగ్‌కు గురిచేసింది. అవును, అతడి ఆత్మహత్యను వివరించడానికి షాకింగ్ అనే మాటే సరైనది.

![]() |
![]() |