![]() |
![]() |

గాయని మంగ్లీ పాడిన బోనాల పాటపై వివాదం నెలకొంది. 'చెట్టు కింద కూసున్నవమ్మ' అనే పాటను రీసెంట్ గా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసింది. అయితే ఈ పాటలో ఉపయోగించిన కొన్ని పదాలపై విమర్శలు వెల్లువెత్తాయి. బోనాల పాటలో అభ్యంతరకర పదాలు వాడారంటూ కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదంపై వివరణ ఇవ్వడంతో పాటు.. లిరిక్స్ లో మార్పులు చేసి కొత్త పాటను రిలీజ్ చేసింది మంగ్లీ.
పాటలో ఉపయోగించిన పదాలపై మంగ్లీ వివరణ ఇచ్చింది. ప్రఖ్యాత జానపద పాటల రచయిత పాలమూరి రామస్వామి గారు 25 ఏళ్ల క్రితమే ఈ పాట రాశారని తెలిపింది. రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం.. పాటలో 'మోతెవరి' అంటే గ్రామ పెద్ద అని అర్థమని.. ఈ అర్థంతోనే పాట సాగుతుందని చెప్పింది. అయితే కాలక్రమంలో ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందని తెలిపింది. యాసను వివాదం చేయడం ద్వారా రచయితను కించపరిచే ప్రయత్నం చేయవద్దని మంగ్లీ కోరింది.
గ్రామదేవతలను ఎలా పూజిస్తారో తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది. తెలంగాణలో గ్రామ దేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలువులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయని పేర్కొంది. భక్తిలో కూడా వైరి భక్తి, మూఢ భక్తి అని రకాలు ఉన్నాయని చెప్పింది. వీటన్నింటి నేపథ్యంలోనే ఈ పాటను రూపొందించామని తెలిపింది. ముఖ్యంగా ఈ పాటలో ఉపయోగించిన 'మోతెవరి' అనే పదంపై విమర్శలు వస్తుండటంతో ఈ లిరిక్స్ లో మార్పులు చేసి కొత్త పాటను రిలీజ్ చేశామని చెప్పుకొచ్చింది. తను ఒక్కరోజులో ఫేమస్ కాలేదని.. తన పాటల వెనక పదేళ్ల కష్టం ఉందని చెప్పింది. కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారని.. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది.
![]() |
![]() |