![]() |
![]() |

తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao). తొంభై ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు. నేటి తరం విజువల్ వండర్ 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
సంగీత ప్రధానమైన కథాంశం
సింగీతం శ్రీనివాసరావు కెరీర్ లో 61వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కు ‘సింగ్-గీతం’ (Sing-Geetham) అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌లో ఉన్నట్లే, ఇది పూర్తిగా సంగీత నేపథ్యంతో సాగే కథ అని తెలుస్తోంది. పైగా 'సింగీతం' పేరు కలిసొచ్చేలా ఈ టైటిల్ ను మూవీ టీమ్ ఆలోచించినట్లు సమాచారం.
ఒకప్పుడు 'శంకరాభరణం', 'సాగర సంగమం' వంటి క్లాసిక్ సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో, అదే స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దాదాపు 12 పాటలు ఉంటాయని సమాచారం. ప్రస్తుత కాలంలో ఒక సినిమాలో ఇన్ని పాటలు ఉండటం అంటే అది నిజంగా సాహసమే.
మెలోడీలు అందించడంలోనూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలోనూ దేవిశ్రీకి ప్రత్యేక శైలి ఉంది. సింగీతం విజన్ కు దేవిశ్రీ సంగీతం తోడైతే, అది వెండితెరపై ఒక దృశ్య కావ్యంలా మారుతుందనడంలో సందేహం లేదు. నాగ్ అశ్విన్ స్వయంగా సింగీతంకి పెద్ద అభిమాని కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు గారు గతంలో 'ఆదిత్య 369', 'పుష్పక విమానం' వంటి ఎన్నో అద్భుతాలను సృష్టించారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ మేకర్ తో కలిసి ఆయన చేస్తున్న ఈ 'సింగ్-గీతం' మ్యూజికల్ జర్నీ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |