![]() |
![]() |

మొదటిసారిగా ఏదైనా భాషలో సినిమా హీరోయిన్‌గా అవకాశం వస్తే తమకు ఆ భాషా చిత్రాలంటే చాలా ఇష్టం అని, అక్కడివారు చాలా మంచివారు అని మాటలు చెప్పేస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే అవసరం తీరినాక మాత్రం ఆయా ఇండస్ట్రీలను మర్చిపోయి అవకాశాలు వచ్చే ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెడతారు. ముఖ్యంగా ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించే నటీమణులు ఈ విషయంలో ఒక ఆకు ఎక్కువగానే చదివి ఉంటారు. వారి దృష్టి అంతా ఎప్పుడూ బాలీవుడ్ మీదనే ఉంటుంది.
సౌత్ ఇండియన్ చిత్రాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నప్పటికీ ఎందుకనో వారికి బాలీవుడ్ పైనే ధ్యాస ఎక్కువ. అలా చూసుకుంటే రష్మిక మందన్నా విషయం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి. కన్నడలో చిత్రాలు చేసినంత కాలం "నా మాతృభాషలో సినిమాలు చేయడం నాకెంతో గర్వంగా ఉంది అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది. అంతే ఒక్కసారిగా ఆమెకు తెలుగులో అవకాశాలు రావడంతో తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వారికి సినిమాలంటే ప్రీతి. మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇక్కడి వారికి మంచి టేస్ట్ ఉంది. హీరోయిన్ లను కూడా చాలా బాగా చూసుకుంటారు" అంటూ నానా హంగామా చేసింది.
అదే ఊపులో ఆమె గత ఏడాది 'పుష్ప1' చిత్రంలో నటించింది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయింది. దాంతో శ్రీవల్లిగా నటించిన రష్మిక పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె దృష్టి అంతా ఇప్పుడు బాలీవుడ్ మీదనే ఎక్కువగా పెడుతోంది. 'ఛలో' చిత్రంతో తెలుగుకు పరిచయమైన ఈమె గీతగోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప-ది రైజ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా ఈమె కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సరసన 'వారసుడు' చిత్రంలో నటించింది.
ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ 'గుడ్ బై', 'మిషన్ మజ్ను' వంటి హిందీ చిత్రాలలో నటించింది. ఇక 'యానిమల్' చిత్రం చిత్రంలో ఈమె ఓ మంచి పాత్రను చేస్తోంది. 'యానిమల్' మూవీకి తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక నటిస్తూ ఉండడం విశేషం. 'గుడ్ బై' చిత్రంలో అమితాబ్ తో కలిసి నటించిన ఈమె, 'మిషన్ మజ్ను' విషయానికి వస్తే సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి యాక్ట్ చేసింది.
ఇక విషయానికి వస్తే రష్మిక మందన్న ఉరఫ్ శ్రీవల్లిని చూసి ఇప్పటివరకు హిందీ ప్రేక్షకులు ఫిదా అవలేదు. ముందు ముందు అయినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో లేదో అనేది అనుమానంగానే ఉన్నా ఆమె మాత్రం గంపెడాశతో ఉంది. ఈమెకు తాజాగా మరో భారీ ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో మంచి హిట్ చిత్రాలు తీసే దర్శకులలో సంజయ్ లీలా భన్సాలీ ముఖ్యులు. ఆయన దర్శకత్వంలో భారీ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలు బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఆమె ముంబైలోని భన్సాలీ ఆఫీస్ నుంచి బయటకు రావడం మీడియా కంటపడింది. ఆఫీస్ వారు ఎవరు సరిగా స్పందించలేదు కానీ బాలీవుడ్ మీడియా జనాలు మాత్రం సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో రష్మిక ఎంపికైందని బలంగా వాదిస్తున్నారు.
తెలుగులో అల్లు అర్జున్‌తో 'పుష్ప2' సినిమాలో నటిస్తోంది. మరో ఒకటి రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. కోలీవుడ్ లో 'వారసుడు' తర్వాత ఆమెకు వేరే అవకాశాలు ఏమీ రాలేదు. కానీ రష్మిక మాత్రం దీనిని చాలా లైట్ గా తీసుకుంటోంది. ఈమె దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఈ పుత్తడి బొమ్మ తాను ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు మారుస్తానని నిరూపించుకుంటోంది. ఇది తెలిసే కన్నడిగులు మాతృభాషపై ఈమెకు మమకారం లేదని వరుసగా ట్రోల్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే..!
![]() |
![]() |