![]() |
![]() |

సాధారణంగా దర్శకులు కావాలని ఆశపడే వారు ఎంతో కాలం పాటు తాము చేయదలుచుకున్న డెబ్యూ మూవీ స్క్రిప్ట్‌పైనే ఏళ్లకు ఏళ్లు సమయం కేటాయిస్తారు. ఆ కథకే మెరుగులుదిద్దుతూ అదే స్క్రిప్ట్‌ను ఓ అద్భుతమైన శిల్పంలా చెక్కుతారు. మరికొందరు దర్శకులుగా అవకాశం వచ్చే లోపు పలు సబ్జెక్ట్‌లను సిద్దం చేసుకుంటూ భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా చాలా కథలపై దృష్టి సారిస్తారు. ఇక విషయానికి వస్తే ఒకే సబ్జెక్ట్‌నే మెరుగులు దిద్దుతూ వచ్చిన వారికి దర్శకులుగా అవకాశం వస్తేమొదటి మూవీని మాత్రం కళాఖండంగా తీర్చిదిద్ది రెండో చిత్రానికి చేతులెత్తేస్తారు. అందుకే కొత్తగా దర్శకులుగా పరిచయమయ్యే పలువురు దర్శకులకు రెండో సినిమా ఓ గండంగా మారుతూ ఉంటుంది. రెండో చిత్రాలుబాగా ఆడవు. అందునా వారి మొదటి చిత్రం చూసి వావ్ అనిపించడంతో రెండో చిత్రం కూడా దానిని మించిన రేంజ్ లో ఉంటుందని భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన వారిని సినిమా బాగానే ఉన్నా కూడా సంతృప్తిని కలిగించలేవు.
ఇక కిందటి ఏడాది విషయానికే వస్తే కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడి ఇండస్ట్రీకి మంచి గుర్తింపు తీసుకుని వచ్చాయి. ఒక విధంగా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీల కంటే గత ఏడాది టాలీవుడ్ లోనే సక్సెస్ రేట్ ఎక్కువ. 2022లో కొంతమంది సీనియర్ దర్శకులు మాత్రమే కాకుండా కొత్తగా వచ్చిన టాలెంట్ దర్శకులు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు మంచి లాభాలు అందించారు వారిలో మొదటగా చెప్పుకోవాల్సింది డిజె టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ. ఈ సినిమాలో హీరో డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ లను అద్భుతంగా ప్రజెంట్ చేసిన విమల్ కృష్ణ దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. అలాగే సింపుల్ గా వచ్చిన లవ్ స్టోరీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమాకు ఫలక్నామా దాస్ సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు అతని మేకింగ్ విధానం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఇక కొత్త దర్శకుడు వశిష్టా నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి తీసిన బింబిసారా చిత్రం ఒక బీభత్సం సృష్టించింది.
ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో క్రియేట్ చేసే ఈ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మొదటిసారి 50 కోట్ల గ్రాస్ అందుకున్న చిత్రంగా ఇది నిలిచింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా ఒకే ఒక జీవితం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. శ్రీ కార్తీక్ టైం ట్రావెల్ నేపథ్యంలో ఒక ఎమోషనల్ డ్రామాను చూపించిన విధానం ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. మసుద చిత్రం బెస్ట్ హర్రర్ మూవీగా నిలిచింది. గతంలో వచ్చిన హర్రర్ మూవీస్ కంటే విభిన్నంగా ఉన్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు సాయికిరణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలని అందుకుంది. ఇలా చూసుకుంటే కిందటేడాది హిట్ వచ్చిన ఈ దర్శకులు కొత్త ఏడాదిలో కూడా తమ ఊపు కొనసాగిస్తారా? మరిన్ని మంచి విజయాలను అందుకుంటూ దూసుకుని వెళ్తారా? లేక వన్ మూవీ వండర్‌గా తేలిపోతారా అనేది 2023 తేల్చనుంది.
![]() |
![]() |