![]() |
![]() |

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించే హీరోలు తక్కువగా ఉంటారు. అందులో ముందు వరుసలో ఉంటాడు దగ్గుబాటి రానా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు రానా. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రానా, శేఖర్ కమ్ముల కెరీర్స్ లో ఇదొక స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా లీడర్ సీక్వెల్ పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పవన్ కళ్యాణ్ తో కలిసి రానా నటించిన 'భీమ్లా నాయక్' ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సక్సెస్ జోష్ లో ఉన్న రానా తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా లీడర్ సీక్వెల్ గురించి ప్రస్తావన రాగా అది దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల్లో ఉందని అన్నాడు. "శేఖర్ కమ్ముల అప్పుడప్పుడు రెండు మూడు సీన్లు చెప్తారు, మళ్ళీ సైలెంట్ అవుతారు. ఎప్పుడు ఉంటుందో చూడాలి" అని రానా చెప్పుకొచ్చాడు.
'లవ్ స్టోరి' సినిమా విడుదల సమయంలో లీడర్ సీక్వెల్ ఉంటుందని శేఖర్ కమ్ముల చెప్పాడు. తాజాగా రానా మాటలను బట్టి చూస్తే శేఖర్ కమ్ముల సీక్వెల్ స్క్రిప్ట్ పై ఇప్పటికే వర్క్ చేస్తున్నారని అర్థమవుతోంది. మరి లీడర్ సీక్వెల్ కి ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో చూడాలి.
![]() |
![]() |