![]() |
![]() |

సినిమా పేరు: రాజు యాదవ్
తారాగణం: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రూపాలక్ష్మి తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయిరామ్ ఉదయ్
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
రచన, దర్శకత్వం: కృష్ణమాచారి
నిర్మాత: ప్రశాంత్ రెడ్డి
బ్యానర్: సాయి వరుణవి క్రియేషన్స్
విడుదల తేదీ: మే 24, 2024
బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను.. వెండితెరపై కూడా పలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'రాజు యాదవ్' అంటూ హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా గెటప్ శ్రీనుకి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
డిగ్రీ ఫెయిల్ అయ్యి ఊళ్ళో ఖాళీగా ఉండే రాజు యాదవ్(గెటప్ శ్రీను)కి ఒకసారి క్రికెట్ ఆడుతుంటే.. ఫేస్ కి కార్క్ బాల్ తగులుతుంది. అక్కడి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చీరాని వైద్యంతో కుట్లు వేయడంతో.. అతని ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లుగా మారిపోతుంది. సర్జరీ చేస్తేనే గానీ.. రాజు ఫేస్ మళ్ళీ నార్మల్ అవ్వదు. కానీ అంత ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకునే స్థోమత రాజుకి ఉండదు. మరోవైపు, ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ కోసం రాజు పోలీస్ స్టేషన్ కి వెళ్లగా.. అక్కడ స్వీటీ(అంకిత ఖరత్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తన వెంట పడొద్దని స్వీటీ చెప్పినా వినకుండా.. ఉద్యోగం కోసం ఆమె హైదరాబాద్ వెళ్తే.. ఆమెని వెతుక్కుంటూ రాజు కూడా సిటీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రాజుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? స్వీటీ ప్రేమని దక్కించుకోగలిగాడా? డబ్బుల కోసం తండ్రితో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? దుబాయ్ కి వెళదామని రాజు ఎందుకు అనుకున్నాడు? ఆపరేషన్ చేయించుకున్నాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ:
హీరోకి క్రికెట్ బాల్ తగిలి.. ఎప్పుడూ నవ్వుతున్నట్టుగా ముఖం మారిపోవడం అనే పాయింట్ తప్ప.. సినిమాలో ఎటువంటి కొత్తదనం లేదు. కథాకథనాలు చాలా రొటీన్ గా ఉన్నాయి. అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి పిచ్చోడిలా తిరగడం.. ఈ తరహా కథలు ఇప్పటికే తెలుగులో ఎన్నో వచ్చాయి. 'రాజు యాదవ్' కూడా అదే కోవకి చెందినది. హీరోకి నవ్వు జబ్బు అనేది ఒక్కటే ఇందులో కొత్త పాయింట్. అయితే ఆ పాయింట్ కి తగ్గట్టుగా.. ఆకట్టుకునే కథాకథనాలు, బలమైన సన్నివేశాలు రాసుకొని.. ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీయడంలో దర్శకుడు అంతగా సక్సెస్ కాలేకపోయాడు. అక్కడక్కడా కామెడీ, ఎమోషన్స్ వర్కౌట్ అయినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం సినిమా రొటీన్ గా నడిచింది.
టెక్నికల్ గా సినిమా బాగానే ఉంది. సాయిరామ్ ఉదయ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. సహజత్వం ఉండేలా చూసుకున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. సురేష్ బొబ్బిలి కూడా తనదైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్, మరికొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించాయి. నిర్మాణ విలువలు పరవాలేదు.
నటీనటుల పనితీరు:
రాజు యాదవ్ పాత్రకి గెటప్ శ్రీను పూర్తి న్యాయం చేశాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటూ.. అన్ని భావోద్వేగాలను కళ్ళతో పలికించాల్సిన కష్టమైన పాత్రలో శ్రీను నటనను మెచ్చుకోవాల్సిందే. అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రూపాలక్ష్మి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా...
దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగానే ఉన్నప్పటికీ.. రొటీన్ కథాకథనాలతో సినిమా తేలిపోయింది. గెటప్ శ్రీను నటన కోసం.. కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్ల కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
![]() |
![]() |