![]() |
![]() |

సినిమా పేరు: బిగ్ బ్రదర్
తారాగణం: శివ కంఠంనేని, ప్రియా హెగ్డే, శ్రీ సూర్య, ప్రీతి శుక్లా, దేవ్ సింగ్, హ్యారీ జోష్, గౌతమ్ రాజ్, గుండు సుదర్శన్, రాజేందర్ తదితరులు
సంగీతం: ఓం ఝా
నేపథ్య సంగీతం: జీభు
డీఓపీ: సూర్య ప్రకాష్
ఎడిటర్: సంతోష్
ఆర్ట్ డైరెక్టర్: షేర
రచన, దర్శకత్వం: సుబ్బారావు గోసంగి
నిర్మాతలు: కె. శివశంకర రావు, ఆర్. వెంకటేశ్వర రావు
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
విడుదల తేదీ: మే 24, 2024
శివ కంఠంనేని కథానాయకుడిగా గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బిగ్ బ్రదర్'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
శివ (శివ కంఠమనేని), గౌరి (ప్రియా హెగ్డే)కి నిశ్చితార్థమై పదేళ్లయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. శివకి తన తమ్ముడు సూర్య(శ్రీసూర్య) అంటే ప్రాణం. ఒకసారి అనుకోకుండా సూర్యపై ఎటాక్ జరిగితే.. శివ కాపాడతాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి గొడవలకు పోకుండా, అసలు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలని సూర్యకి శివ చెబుతాడు. తన అన్న మాటలని సీరియస్ గా తీసుకోని సూర్య.. వదినకి మాయ మాటలు చెప్పి బయటకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో సూర్యకి పూజ(ప్రీతి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో సూర్య, పూజలపై ఎటాక్ జరుగుతుంది. ఆ ఎటాక్ ని శివ, సూర్య కలిసి తిప్పికొడతారు. అయితే అసలు ఆ ఎటాక్ జరిగింది పూజ కోసమని తెలుసుకుంటాడు శివ. పూజ ఎవరు? ఆమె గతమేంటి? ఆమెపై ఎటాక్ చేసింది ఎవరు? అలాగే శివ, సూర్యల గతం ఏంటి? నిశ్చితార్థం జరిగినా పెళ్లి చేసుకోకుండా శివ ఉండటానికి కారణమేంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
లవ్, యాక్షన్, కామెడీ, ఎమోషనల్, డ్యాన్స్ వంటి అంశాలతో ఫుల్ మీల్స్ లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు ఈమధ్య బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని భర్తీ చేయడం కోసమే అన్నట్టుగా 'బిగ్ బ్రదర్' రూపొందింది అని చెప్పవచ్చు. అన్ని అంశాలను సమపాళ్లలో ఉండేలా చూసుకున్న దర్శకుడు.. మాస్, ఫ్యామిలీ, యూత్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా సినిమాని మలిచాడు.
ఫస్టాఫ్ లో ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అన్నదమ్ముల అనుబంధం, వదిన మరిది ఆప్యాయత, నానమ్మ మనవడి అల్లరి.. వంటి సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సూర్య-పూజ లవ్ ట్రాక్ తో పాటు.. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు కూడా మెప్పించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక సెకండాఫ్ లో యూత్ ని మెప్పించే అంశాలు ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్, కాలేజ్ ఎపిసోడ్స్ ని చూపిస్తూ సెకండాఫ్ ని నడిపించిన తీరు బాగుంది. తమ్ముడి ప్రేమను గెలిపించడం కోసం అన్న చేసిన పోరాటం మెప్పించింది. అలాగే శివ పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయాన్ని చక్కగా చూపించారు.
టెక్నికల్ గా ఈ సినిమా పరవాలేదు. మ్యూజిక్ ఓకే. పాటలు వినడానికి బాగానే ఉన్నా.. గుర్తు పెట్టుకొని పాడుకునేలా లేవు. ప్రకాష్ కెమెరా పనితనం బాగానే ఉంది. సంతోష్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణాలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
శివ పాత్రలో శివ కంఠమనేని మెప్పించాడు. అన్ని ఎమోషన్స్ ని బాగా పలికించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. రెండు షేడ్స్ ఉన్న సూర్య పాత్రలో శ్రీసూర్య నటన ఆకట్టుకుంది. ప్రీతి, గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా...
లవ్, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలతో ఫుల్ మీల్స్ లాంటి కమర్షియల్ సినిమాలు ఈమధ్య బాగా తగ్గిపోయాయి. అలాంటి పక్కా కమర్షియల్ సినిమా చూడాలి అనుకునేవారు.. 'బిగ్ బ్రదర్' చిత్రానికి హ్యాపీగా వెళ్లొచ్చు.
రేటింగ్: 2.75/5
![]() |
![]() |